sushma swaraj: పాకిస్థాన్ తో చర్చలకు సిద్ధంగా లేమని మేమెప్పుడూ చెప్పలేదు: సుష్మా స్వరాజ్
- 192 దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలపై ఆలోచించాం
- ఇప్పటి వరకు 186 దేశాలతో ద్వైపాక్షిక చర్చలు జరిపాం
- ఉగ్రవాదాన్ని రూపుమాపే వరకు చర్చలు సాధ్యం కాదు
ప్రధాని నరేంద్ర మోదీ నాలుగేళ్ల పాలనలో విదేశాంగ శాఖ సాధించిన విజయాలపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రూపొందించిన పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వీకే సింగ్, ఎంజే అక్బర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా, సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ, ప్రభుత్వ అధికారులు ప్రపంచంలోని పలు దేశాలను పర్యటించారని చెప్పారు. 192 దేశాల్లో కనీసం 186 దేశాల్లో ఇప్పటికే పర్యటించడం సంతోషకరమైన విషయమని అన్నారు.
మేము అధికారంలోకి రాక మునుపు, ప్రపంచంలోని చాలా దేశాల్లో మన నాయకులు ఇంతవరకూ పర్యటించలేదని తెలిసి ఆశ్చర్యపోయానని అన్నారు. ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వ దేశాల సంఖ్య 192 అని, ఈ దేశాలన్నింటిలో పర్యటించాలని, మంత్రిత్వ స్థాయి చర్చలు జరపాలని తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలోనే అనుకున్నామని, ఇప్పటివరకు 186 దేశాల్లో పర్యటించామని సుష్మా స్వరాజ్ చెప్పారు.
ఈ సందర్భంగా డోక్లామ్, పాకిస్థాన్ తో చర్చలు, పలు దేశాల్లో ఇబ్బంది పడుతున్న భారతీయులను రక్షించిన అంశాల గురించి ఆమె ప్రస్తావించారు. వివిధ దేశాల్లో చిక్కుకున్న తొంభై వేల మంది భారతీయులను రక్షించామని చెప్పారు. పాకిస్థాన్ తో చర్చలకు సిద్ధంగా లేమని తాము ఎప్పుడూ చెప్పలేదని, ఉగ్రవాదాన్ని రూపుమాపే వరకు చర్చలు సాధ్యం కాదని, సరిహద్దులో ఉద్రిక్తతలు ఉన్నప్పుడు చర్చలు సరికాదని స్పష్టం చేశారు. రష్యా దేశంతో భారత సంబంధాలు క్షీణిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని అన్నారు.