Nasir Ul Mulk: పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్
- జూలై 25న పాక్ లో సార్వత్రిక ఎన్నికలు
- పాలనను పర్యవేక్షించేందుకు ఆపద్ధర్మ ప్రధాని ఎంపిక
- పదవిలో 2 నెలల పాటు ఉండనున్న సనీరుల్ ముల్క్
పాక్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నసీరుల్ ముల్క్ నియమితులవనున్నారు. జూలై 25న పాకిస్థాన్ లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అంటే దాదాపు రెండు నెలల పాటు ఆపద్ధర్మ ప్రధానిగా నసీరుల్ కొనసాగుతారు.
మరోవైపు, ఎన్నికల నేపథ్యంలో ఆపద్ధర్మ ప్రధానిగా ఎవరు ఉండబోతున్నారనే విషయమై పాక్ లో గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నసీరుల్ నియామకంతో అధికార, ప్రతిపక్షాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్ఠంభనకు తెరపడింది. ఎన్నికల అనంతరం ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆపద్ధర్మ ప్రధాని పదవి నుంచి నసీరుల్ తప్పుకుంటారు. అయితే, తన పదవీకాలంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం నసీరుల్ కు ఉండదు. ఆర్థికపరంగా దేశం తీవ్ర ఒడిదుడుకులకు లోనైతే మాత్రం ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది.