bsnl: ల్యాండ్ లైన్ ఫోన్ నుంచే చాటింగ్... మొబైల్ తరహా సేవలకు సిద్ధం చేస్తున్న బీఎస్ఎన్ఎల్
- ప్రయోగాత్మకంగా రాజస్థాన్ లోని బుండి జిల్లాలో పరీక్ష
- ఐపీ ఫోన్ అప్ గ్రేడ్ కావడం ద్వారా అత్యాధునిక సేవలు
- ల్యాండ్ లైన్ కు వచ్చే కాల్స్ ను మొబైల్ నుంచే మాట్లాడుకునే వీలు
ప్రజల్లో ల్యాండ్ లైన్ ఫోన్ల పట్ల ఆసక్తి తగ్గిపోవడంతో మళ్లీ వాటిని ఆకర్షణీయంగా మార్చేందుకు బీఎస్ఎన్ఎల్ నడుం బిగించింది. ల్యాండ్ లైన్ ఫోన్ల నుంచి ఎస్ఎంఎస్ లు పంపుకునేందుకు, వీడియో కాల్స్ చేసుకునేందుకు, రింగ్ టోన్స్ సెట్ చేసుకునేందుకు వీలుగా మార్పులు చేస్తోంది. ప్రయోగాత్మకంగా రాజస్థాన్ లోని బుండి జిల్లాలో టెలికం ఎక్సేంజీల్లో అత్యాధునిక టెక్నాలజీని ప్రవేశపెడుతోంది. ఈ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. వచ్చే కొన్ని వారాల్లో పనులు పూర్తవుతాయని బుండి టెలికం జిల్లా మేనేజర్ బీకే అగర్వాల్ తెలిపారు.
ఈ సదుపాయాల కోసం ఐపీ ఫోన్ కు అప్ గ్రేడ్ కావాల్సి ఉంటుందని అగర్వాల్ పేర్కొన్నారు. అలాగే, కస్టమర్లు తమ ల్యాండ్ లైన్ ఫోన్ ను మొబైల్ ఫోన్ కు అనుసంధానించుకోవచ్చని, ల్యాండ్ లైన్ కు వచ్చిన కాల్స్ ను మొబైల్ నుంచే మాట్లాడుకోవచ్చని తెలిపారు. దీంతో ల్యాండ్ లైన్ ఫోన్ కు దూరంగా వెళ్లినా కాల్స్ ను స్వీకరించే అవకాశం ఉంటుందన్నారు.