IT Corridor: హైదరాబాద్ డీఎల్ఎఫ్ ఐటీ కారిడార్ లో ఇంటర్నెట్ కట్... పలు కంపెనీల్లో నిలిచిన ఐటీ సేవలు!
- నోటీసులు ఇవ్వకుండా కేబుల్స్ కట్ చేసిన మునిసిపల్ సిబ్బంది
- ట్విట్టర్ లో కేటీఆర్ కు ఫిర్యాదు చేసిన కంపెనీలు
- అనుమతి లేకుండా కేబుల్స్ పెట్టుకున్నారంటున్న అధికారులు
హైదరాబాద్ లోని గచ్చిబౌలి, డీఎల్ఎఫ్ ఐటీ కారిడార్ లో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఇంటర్నెట్ కేబుల్ వైర్లను మునిసిపల్ అధికారులు తొలగించడంతో పలు ఐటీ కంపెనీల సేవలు నిలిచిపోయాయి. ఐటీ కారిడార్ కు ఆనుకుని ఉన్న జయభేరీ ఎన్ క్లేవ్ ఖాళీ స్థలంలో పెట్ పార్కును నిర్మిస్తుండగా, దీని ముందున్న కరెంటు స్తంభాలకు ఇంటర్నెట్ వైర్లు ఉన్నాయి.
వీటిని తొలగించాలన్న ఉద్దేశంతో శేరిలింగంపల్లి వెస్ట్ జోనల్ కమిషనర్ హరిచందన, సర్కిల్-20 డిప్యూటీ కమిషనర్ మమత ఆధ్వర్యంలోని ఎలక్ట్రికల్ సిబ్బంది కేబుల్స్ ను తొలగించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా నెట్ కేబుల్స్ తొలగించడంపై మంత్రి కేటీఆర్ కు ఐటీ కంపెనీల ప్రతినిధులు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. కాగా, స్తంభాలకు కేబుల్స్ పెట్టిన వాళ్లు అనుమతులు తీసుకోలేదని మునిసిపల్ అధికారులు తెలిపారు. అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటే కేబుల్స్ ను పునరుద్ధరిస్తామని హరిచందన చెప్పారు.