Hyderabad: హైదరాబాద్ లో వదంతులు సృష్టించిన కేసులో ఐదుగురు జర్నలిస్టుల అరెస్ట్!
- 26 తేదీన పిల్లల కిడ్నాపర్లంటూ రాళ్ల దాడి
- ఓ వ్యక్తి ప్రాణాలు బలిగొన్న వదంతులు
- 14 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ చాంద్రాయణ గుట్టలో చిన్న పిల్లల కిడ్నాపర్లంటూ ఇద్దరు హిజ్రాలు సహా ముగ్గురు వ్యక్తులపై దాడికి దిగి, ఓ వ్యక్తి మరణానికి కారణమైన ఘటనలో పోలీసులు ఐదుగురు జర్నలిస్టులు సహా 14 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించిన పోలీసులు, ఈ నెల 26వ తేదీన హఫీజ్ బాబా నగర్ లోని అజీం హోటల్ వద్ద జరిగిన ఘటనకు, సోషల్ మీడియా ద్వారా వైరల్ అయిన వదంతులే కారణమని తేల్చారు. ఈ వదంతులను పుట్టించిన వారిని గుర్తించామని అన్నారు.
హఫీజ్ హోటల్ వద్ద ఓ ముస్లిం మత పెద్ద కల్పించుకుని, రంజాన్ పర్వదినాల్లో హింస కూడదని వారించి ఇద్దరిని రక్షించారని పోలీసులు తెలిపారు. ఇదే సమయంలో డెక్కన్ మెడికల్ హాల్ వద్ద మరో ఇద్దరిని నిరసనకారులు చుట్టుముట్టి రాళ్లతో కొట్టారని, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చంద్రయ్య (52) ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరుసటి రోజు మరణించాడని తెలిపారు. తాము అరెస్ట్ చేసిన 14 మందిలో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు.