Arvind Kejriwal: ఢిల్లీ మంత్రి నివాసంలో సీబీఐ సోదాలు.. మోదీని నిలదీసిన కేజ్రీవాల్!
- ఢిల్లీ మంత్రి జైన్ నివాసంలో సీబీఐ సోదాలు
- మోదీకి ఏం కావాలంటూ కేజ్రీవాల్ ప్రశ్న
- ఆప్ ప్రభుత్వ పేరును చెడగొట్టేందుకే ఇలాంటి చర్యలంటూ మండిపడ్డ శిసోడియా
ప్రధాని మోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి మండిపడ్డారు. ఢిల్లీ రాష్ట్ర మంత్రి సత్యేంద్ర జైన్ నివాసంలో ఈ ఉదయం సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. దీంతో కేజ్రీ మండిపడ్డారు. అసలు మోదీకి ఏం కావాలంటూ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.
ఢిల్లీలోని మొహల్లా క్లినిక్స్, ఇతర పీడబ్ల్యూడీ ప్రాజెక్టుల కోసం 24 మందితో పీడబ్ల్యూడీ శాఖ ఓ క్రియేటివ్ టీమ్ ను ఏర్పాటు చేసింది. అయితే, ఈ టీమ్ లో నియామకాలు సరిగ్గా జరగలేదనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు పీడబ్ల్యూడీ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ నివాసం సహా, ఇతర పీడబ్ల్యూడీ అధికారుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. అనంతరం సత్యేంద్ర జైన్ పై కేసు నమోదు చేశారు. ఇప్పటికే మనీలాండరింగ్ కు సంబంధించి జైన్ పై సీబీఐ విచారణ జరుపుతోంది.
ఈ సోదాలపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ శిసోడియా స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆప్ ప్రభుత్వం పేరును చెడగొట్టేందుకు కేంద్రం ఇలాంటి దాడులు చేయిస్తోందని ఆరోపించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి చర్యలను చేపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.