Palghar: ఎలక్షన్ కమిషన్ పై ఉద్దవ్ థాకరే వివాదాస్పద వ్యాఖ్యలు!
- ఉప ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయన్న శివసేన
- అధికారంలో ఎవరు ఉంటే వారికి అనుకూలంగా ఈసీ
- ఉద్దవ్ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ
ఎన్నికల సంఘంపై శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్ కమిషన్ బీజేపీకి ఉంపుడుగత్తెలా మారిపోయిందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఎన్నికల సంఘం, దాని యంత్రాంగం అన్నీ అధికారంలో ఉన్న వారికి ఊడిగం చేస్తున్నాయని అన్నారు. ఇటీవల జరిగిన పల్ఘర్ లోక్సభ ఉప ఎన్నికలో బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించిన ఆయన, ఈవీఎంలు, వీవీపాట్ మిషన్లు సరిగా పనిచేయకపోవడానికి అదే కారణమన్నారు.
ఎవరు అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా పనిచేయడం ఎన్నికల కమిషన్ అలవాటుగా మార్చుకుందని ఎద్దేవా చేశారు. ఉద్దవ్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఎన్నికల కమిషన్ గురించి ఆయన అలా మాట్లాడాల్సింది కాదని పేర్కొంది. ఓ పార్టీ చీఫ్గా ఉన్న వ్యక్తి ఎన్నికల సంఘంపై అభాండాలు వేయడం సరికాదని హితవు పలికింది.