Tirumala: తిరుమలకు వచ్చి స్వామి దర్శనం చేసుకోకుండానే వెనుదిరుగుతున్న భక్తులు!
- భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల గిరులు
- రోజుకు 80 వేల మందికి పరిమితమైన దర్శనం
- అఖిలాండం వద్ద నమస్కరించి వెనుదిరుగుతున్న భక్తులు
ఎన్నో వ్యయ ప్రయాసలతో ఏడుకొండల వాడి దర్శనానికి వస్తున్న భక్తులు, స్వామిని దర్శనం చేసుకోకుండానే వెనుదిరుగుతున్న పరిస్థితి నెలకొంది. రోజుల తరబడి వేచి చూడలేక, అద్దె గదులు దొరక్క, వేలాది మంది భక్తులు అఖిలాండం వద్ద కర్పూరం వెలిగించి, ఓ కొబ్బరికాయ కొట్టి, అక్కడి నుంచే స్వామికి ఓ నమస్కారం పెట్టి వెనుదిరుగుతున్నారు.
వేసవి సెలవులు ముగియనుండటంతో గత పది రోజులుగా తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దర్శనానికి ఒక రోజు నుంచి రెండు రోజుల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి వుంది. రోజుకు 20 వేల టైమ్ స్లాట్ టోకెన్లను టీటీడీ జారీ చేస్తుండగా, మరో 20 వేల మంది వరకూ రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో కొనుగోలు చేసి వస్తున్నారు. వీరితో పాటు వివిధ రకాల సేవల టికెట్లను కొనుగోలు చేసిన భక్తుల సంఖ్య 10 వేల వరకూ ఉంటోంది. రోజులో 50 వేల మందికి పైగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కి చేరుతున్న సర్వదర్శనం భక్తుల్లో 20 నుంచి 25 వేల మందికి మాత్రమే దర్శనం లభిస్తోంది. మిగతా వారంతా మరుసటి రోజు తమ సమయం కోసం కంపార్టుమెంట్లలోనే గడపాల్సిన పరిస్థితి నెలకొంది.
గత వారం చివరిలో దర్శనానికి ఎన్నడూ లేనంతగా 58 గంటల సమయం పట్టిందంటే, తిరుమలలో భక్తుల రద్దీ ఎంతగా ఉందో అర్థమవుతుంది. ఒకప్పుడు రోజుకు 1.05 లక్షల మందికి స్వామి దర్శనభాగ్యం కలిగేదని, ఇప్పుడా సంఖ్యను 50 నుంచి 80 వేలకు తగ్గించడం కూడా రద్దీ పెరగడానికి కారణమని తెలుస్తుండగా, టైమ్ స్లాట్ విధానం సంతృప్తికరంగా లేదని భక్తులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.