dk sivakumar: మంత్రి కాబోతున్న డీకే శివకుమార్ కు షాక్ ఇచ్చిన సీబీఐ
- నిన్న రాత్రి శివకుమార్ సన్నిహితుల నివాసాలపై సీబీఐ దాడి
- ప్రెస్ మీట్ పెట్టి బీజేపీని విమర్శించిన డీకే
- గంటల వ్యవధిలోనే శివకుమార్ కు చెందిన ఐదు ప్రాంతాల్లో తనిఖీలు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ చక్రం తిప్పిన సంగతి తెలిసిందే. బీజేపీ వ్యూహాలకు చెక్ పెడుతూ, జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరడంలో శివకుమార్ కీలక పాత్ర పోషించారు. తాజాగా ఆయనకు సీబీఐ అధికారులు షాక్ ఇచ్చారు. నిన్న రాత్రి ఆయనకు సంబంధించిన వ్యక్తుల నివాసాలపై సెర్చ్ వారెంట్ తో అకస్మిక తనిఖీలను నిర్వహించారు. ఈ తనిఖీలతో శివకుమార్ షాక్ కు గురయ్యారు. తన సోదరుడు, బెంగళూరు రూరల్ ఎంపీ అయిన డీకే సురేష్ తో కలసి ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ, తమకు నచ్చని వ్యక్తులపై ఐటీ, ఈడీ, సీబీఐలాంటి సంస్థలను బీజేపీ ఉసిగొల్పుతోందని మండిపడ్డారు. తన సన్నిహితుల ఇళ్లపై సీబీఐ దాడులు అందులో భాగమేనని చెప్పారు. తన వ్యక్తిగత ఆస్తులను కూడా బీజేపీ టార్గెట్ చేసిందని విమర్శించారు. ఈ ప్రెస్ మీట్ ముగిసిన గంటల వ్యవధిలోనే... శివకుమార్ కు చెందిన ఐదు ప్రాంతాల్లో సీబీఐ దాడులు జరిగాయి. మరోవైపు, శివకుమార్, సురేష్ ల ఆస్తులకు సంబంధించి తాము ఎలాంటి సర్చ్ వారెంట్లు జారీ చేయలేదని సీబీఐ అధికారులు చెబుతుండటం గమనార్హం.