lakshminarayana: బీజేపీలో చేరుతున్నారన్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
- బీజేపీలో చేరనున్నాననే వార్తల్లో వాస్తవం లేదు
- జిల్లాల పర్యటన పూర్తయిన తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటా
- రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తే చాలు
ప్రజాసేవ చేయాలన్న తపనతో అత్యున్నతమైన ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి... ఏపీలో పల్లెబాట పట్టారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. అయితే, బీజేపీలో ఆయన చేరబోతున్నారని, 2019 ఎన్నికల్లో బీజేపీ ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే అనే ప్రచారం ఓవైపు జరుగుతోంది.
ఈ విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు. జిల్లాల పర్యటన పూర్తయిన తర్వాత రాజకీయపరంగా ఓ నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. రైతులు సబ్సిడీలు, పథకాలను ఆశించడం లేదని... పంటలకు గిట్టుబాటు ధర ఇస్తే చాలంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి సమస్య పరిష్కారం కావాలని ఆకాంక్షించారు. ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే ప్రజల్లోకి వచ్చానని చెప్పారు.
అయితే, ఈ మధ్య ఆరెస్సెస్ కు సంబంధించిన ఓ కార్యక్రమానికి లక్ష్మీనారాయణ హాజరయ్యారు. దీంతో, ఆయన బీజేపీలో చేరుతున్నారనే వాదనకు మరింత బలం వచ్చింది. మరోవైపు పార్టీ గురించి, ఎన్నికల్లో పోటీ గురించి ఆయన ఇంతవరకు మాట్లాడకపోయినా... తనకు వ్యవసాయ మంత్రిగా పని చేయాలని ఉందని గతంలో ఓసారి ఆయన చెప్పారు.