mahabharat: మహా భారతంలోనూ ప్రత్యక్ష ప్రసారాలు జరిగాయి!: యూపీ బీజేపీ మంత్రి
- నారద ముని ఆ కాలంలోనే సమాచారాన్ని చేరవేసేవారు
- ఆయన ఎక్కడికయినా వెళ్లగలరు
- ఒకచోటు నుంచి మరొక చోటుకి సమాచారాన్ని అందించగలరు
- సంజయుడు ప్రత్యక్ష ప్రసారాలను చూపించాడు
తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. బీజేపీ నేతలు వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్.. మహా భారత కాలంలో ఇంటర్నెట్, శాటిలైట్ కమ్యూనికేషన్ ఉన్నాయని అనగా, హనుమంతుడు ప్రపంచంలోనే తొలి ఆదివాసి నాయకుడు అని బీజేపీ రాజస్థాన్ ఎమ్మెల్యే జ్ఞాన్దేవ్ అహుజా సెలవిచ్చారు. తాజాగా ఇటువంటి విచిత్ర వ్యాఖ్యలు చేసిన వారి జాబితాలో మరో బీజేపీ నేత చేరారు.
జర్నలిజం, ప్రత్యక్ష ప్రసారాలు అనేవి మహాభారత కాలంలోనే ప్రారంభమయ్యాయని ఉత్తరప్రదేశ్ మంత్రి దినేష్ శర్మ వ్యాఖ్యానించారు. 'హిందీ జర్నలిజం డే' కార్యక్రమానికి హాజరైన ఆయన ప్రసంగిస్తూ... సంజయుడు హస్తినాపురంలోనే ఉండి కురుక్షేత్రంలో జరుగుతున్న యుద్ధం గురించి ఎప్పటికప్పుడు దృతరాష్ట్రుడికి వివరించాడని అన్నారు. మరి ఇది లైవ్ టెలికాస్ట్ కాకపోతే మరేంటని ప్రశ్నించారు.
అలాగే, సెర్చ్ ఇంజన్ గూగుల్ అనేది ఇప్పుడు ప్రారంభమైంది కానీ, నారద ముని ఆ కాలంలోనే సమాచారాన్ని చేరవేయడంలో సిద్ధహస్తుడని సదరు మంత్రి అన్నారు. ఆయన ఎక్కడికయినా వెళ్లగలరని, ఒకచోటు నుంచి మరొక చోటుకి సమాచారాన్ని అందించగలరని పేర్కొన్నారు.