Lord Sri Rama: సీతను శ్రీరాముడే అపహరించాడట!.. గుజరాత్ విద్యార్థులకు నేర్పుతున్నది ఇదే!
- సీతాదేవిని అపహరించింది రావణాసురుడు కాదట
- తప్పుల తడకగా 12వ తరగతి సంస్కృత పాఠ్యపుస్తకం
- గుజరాత్ బోర్డు తీరుపై సర్వత్ర విమర్శలు
సీతాదేవిని అపహరించింది ఎవరు? ఇదేం ప్రశ్న.. ఆ మాత్రం తెలియదా? రావణాసురుడు.. అని చెబితే మీరు పప్పులో కాలేసినట్టే. సీతాదేవిని అపహరించింది రావణాసురుడు కాదట.. ఆయన పతిదేవుడు సాక్షాత్తూ శ్రీరామచంద్రుడేనట. గుజరాత్లోని పన్నెండో తరగతి విద్యార్థిని ఎవరిని అడిగినా ఇదే విషయం చెబుతారు. ఎందుకంటే.. వారి సంస్కృత పాఠ్య పుస్తకంలో అలాగే రాసుంది మరి.
గుజరాత్ బోర్డు నిర్వాకమిది. అది ముద్రించిన పాఠ్యపుస్తకాల్లోని రామాయణంపై పాఠంలో సీతాదేవిని రాముడే అపహరించినట్టు పేర్కొన్నారు. అదొక్కటే కాదు, ఇంకా చాలా తప్పులు అందులో కనిపించాయి. ఈ విషయంపై గుజరాత్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ డాక్టర్ నితిన్ పేథానీని సంప్రదిస్తే.. పాఠ్యపుస్తకంలో తప్పులు ఉన్నట్టు తనకు తెలియదని తొలుత పేర్కొన్నారు. తర్వాత తప్పు జరిగినట్టు అంగీకరించారు. అనువాదంలో పొరపాటు జరిగిందని, రావణుడికి బదులు రాముణ్ని చేర్చారని పేర్కొన్నారు.
గుజరాత్ బోర్డు తీరుపై ఇప్పుడు సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న పిల్లలకు కూడా తెలిసిన విషయం అధికారులకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. పుస్తకాలు విద్యార్థులకు చేరే వరకు తప్పులను గుర్తించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.