India: చొరబడిన ఉగ్రవాదులు... దేశవ్యాప్తంగా హై అలర్ట్!
- సరిహద్దులు దాటిన 12 మంది ఉగ్రవాదులు
- రెండు బ్యాచ్ లుగా విడిపోయి దాడికి యత్నాలు
- హెచ్చరించిన ఇంటెలిజెన్స్ వర్గాలు
పాకిస్థాన్ నుంచి జైషే మహమ్మద్ కు చెందిన 12 మంది ఉగ్రవాదులు సరిహద్దులు దాటి దేశంలోకి ప్రవేశించారని నిఘా వర్గాలు సమాచారం ఇవ్వడంతో దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు పలు ప్రధాన ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదులు రెండు బృందాలుగా విడిపోయారని, ఏ ప్రాంతంలోనైనా దాడులకు తెగబడవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
రంజాన్ నెలలో 17వ రోజు లేదా బదర్ పవిత్ర యుద్ధం వార్షికోత్సవం సందర్భంగా శనివారం నాడు దాడికి ప్రణాళికలు రూపొందించినట్టు తెలుస్తుండటంతో అలర్ట్ అయిన పోలీసులు, పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, నేడు కాశ్మీర్ లోని పుల్వామాలో ఓ సైనిక వాహనంపై ఉగ్రవాదులు మెరుపుదాడికి దిగారని తెలుస్తోంది. ఉగ్రవాదులను జవాన్లు అడ్డుకోగా, వారు పారిపోయారు. ఘటనా స్థలి నుంచి ఐఈడీ బాంబులున్న మూడు బ్యాగులు లభించినట్టు సమాచారం. వీరిని పట్టుకునేందుకు భారీ సెర్చ్ ఆపరేషన్ ను సైన్యం ప్రారంభించింది.