Noida: యూపీ సీఎం ఆదిత్యనాథ్ ను వెంటాడుతున్న 'నోయిడా' సెంటిమెంట్!
- నోయిడాలో పర్యటిస్తే ఓటమి చవిచూసే యూపీ సీఎం
- గతంలో పదవికి దూరమైన ములాయం, మాయావతి
- వరుసగా ఉప ఎన్నికల్లో ఆదిత్యనాథ్ పరాజయాలు
- నోయిడా శాపమే కారణమంటున్న ప్రజలు
నోయిడాలో పర్యటించిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి తదుపరి ఎన్నికల్లో విజయం సాధించరు. నోయిడాను సందర్శించే ముఖ్యమంత్రికి శాపం తగులుతుందని, ఆపై ఎన్నికల్లో గెలిచే అవకాశాలే లేవని అత్యధిక యూపీ ప్రజలు నమ్ముతారు కూడా. 1980ల్లో వీర్ బహదూర్ సింగ్ తో మొదలై, ములాయం సింగ్ యాదవ్, మాయావతిలు నోయిడా శాపానికి గురై పదవులను కోల్పోయారు. ఇక తాజా సీఎం యోగి ఆదిత్యనాథ్, గత డిసెంబర్ లో గ్రేటర్ నోయిడా, నోయిడా ప్రాంతాల్లో పర్యటించి రాగా, ఆపై జరిగిన ఉప ఎన్నికల్లో వరుస ఓటములు ఎదురవుతుండటంతో, మరోసారి నోయిడా నమ్మకం తెరపైకి వచ్చింది.
తన సొంత నియోజకవర్గమైన గోరఖ్ పూర్, యూపీ డిప్యూటీ సీఎం ఖాళీ చేసిన ఫుల్ పూర్ లను గతంలో పోగొట్టుకున్న బీజేపీ, తాజా ఉప ఎన్నికల్లో అత్యంత కీలకమైన కైరానా స్థానానికి కూడా దూరమైంది. తండ్రి మరణంతో ఆమె కుమార్తెను రంగంలోకి దింపినా, ప్రజలు సానుభూతిని చూపకపోవడం గమనార్హం. ఈ స్థానం నుంచి విపక్షాలన్నీ మద్దతిచ్చిన ఆర్ఎల్డీ అభ్యర్థిని తబుస్సుమ్ హసన్ 44,618 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి, యూపీ నుంచి ప్రస్తుత లోక్ సభకు ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా రికార్డు సృష్టించారు. ఇదే సమయంలో నూర్ పూర్ అసెంబ్లీ స్థానాన్ని కూడా బీజేపీ కోల్పోయింది.
2003లో నోయిడా సందర్శనకు వెళ్లిన ములాయం, ఆపై 2007లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోగా, 2011లో నోయిడా ట్రిప్ వేసిన మాయావతి, 2012లో పదవికి దూరమయ్యారు. ఇక ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ పరిస్థితి కూడా అలానే కనిపిస్తోందన్నది చాలా మంది వాదన.