Raghuveera Reddy: ఇక మా గేమ్ మొదలవుతుంది: రఘువీరారెడ్డి కీలక వ్యాఖ్యలు
- అన్ని విభజన హామీల అమలు కాంగ్రెస్ వస్తేనే సాధ్యం
- చంద్రబాబు, రాహుల్ కాకతాళీయంగానే కలిశారు
- కాంగ్రెస్ ను వీడేది లేదన్న రఘువీరా
ఇకపై ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ గేమ్ మొదలవుతుందని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీనియర్ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమన్ చాందీని పార్టీ ఇన్ చార్జ్ గా వేశారని, ఆయన సలహాలు, సూచనలతో 2019 ఎన్నికలే టార్గెట్ గా ముందుకు సాగనున్నామని, రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా మొదలు, అన్ని కీలక హామీలూ కాంగ్రెస్ వస్తేనే నెరవేరుతాయని ప్రజల్లోకి వెళ్లనున్నట్టు ఆయన తెలిపారు.
చంద్రబాబు, రాహుల్ గాంధీలు బెంగళూరులో కలిసింది కాకతాళీయమేనని, తెలుగుదేశంతో పొత్తులపై ఇంతవరకూ ఎలాంటి చర్చలూ జరగలేదని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం కాంగ్రెస్ ను వీడేది లేదని స్పష్టం చేసిన ఆయన, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయనింకా బీజేపీతో తెగదెంపులు చేసుకున్నట్టు కనిపించడం లేదని, బీజేపీ మంత్రి భార్యకు టీటీడీ పాలక మండలిలో పదవిని ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భర్తను మహానాడు వేదికపై కూర్చోబెట్టారని, ఇవన్నీ చూస్తుంటే, బీజేపీతో కటీఫ్ చెప్పినట్టు ఎలా నమ్మాలని అడిగారు.