Pawan Kalyan: అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేయాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోం!: పవన్ కల్యాణ్ హెచ్చరిక
- జనసేన ప్రభుత్వం వచ్చాక తిరిగి తీసుకుంటాం
- ఆశా వర్కర్ల, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు తీర్చాలి
- వారి ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలి
- సరైన జీతభత్యాలు అందించాలి
అగ్రిగోల్డ్ బాధితులకి తమ పార్టీ అండగా ఉంటుందని, అలాగే ఆ సంస్థ ఆస్తులను చౌకగా కొట్టేయాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తే తాము చూస్తూ ఊరుకోబోమని, జనసేన ప్రభుత్వం వచ్చాక తిరిగి తీసుకుంటామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఈరోజు విజయనగరం జిల్లా గజపతి నగరంలో జన పోరాట యాత్ర కొనసాగించిన పవన్ మాట్లాడుతూ... ఆశా వర్కర్ల, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు తీర్చాలని, వారి ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, సరైన జీతభత్యాలు అందించాలని డిమాండ్ చేశారు.
పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం తమ పార్టీ మేనిఫెస్టోలోనూ పొందుపరుచుతామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను కూడా పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు అండగా నిలబడే ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఉండాలి కానీ, వారిని దోచుకునే ప్రభుత్వం ఉండకూడదని హితవు పలికారు.