Andhra Pradesh: ఏపీ టెట్ పరీక్షా కేంద్రాలకు మొత్తం 3,83,066 మంది అభ్యర్థుల ఆప్షన్ల నమోదు: టెట్ కన్వీనర్
- ఈనెల 5న మధ్యాహ్నం 12 గం.ల నుంచి హాల్ టికెట్లు
- టెట్ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్
- అభ్యర్థులు సూచించిన ప్రకారమే సెంటర్ల ఎంపిక
- ఆప్షన్లు పెట్టిన 96.258 శాతం మంది అభ్యర్థులు
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు సంబంధించి జిల్లా పరీక్షా కేంద్రాల ఆప్షన్ల నమోదు ముగిసిందని టెట్ కన్వీనర్ ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. టెట్ కు 3,97,957 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా 3,83,066 మంది అభ్యర్థులు సెంటర్ల ఆప్షన్లను పెట్టుకొన్నారని ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.
ఆప్షన్లను పెట్టుకున్న అభ్యర్థులకు వారు సూచించిన ప్రకారమే సెంటర్ల ఎంపిక ఉంటుందన్నారు. 96.258 శాతం మంది ఆప్షన్లు పెట్టగా 14,891 మంది అంటే 3.742 శాతం అభ్యర్థులు ఆప్షన్లు పెట్టలేదని తెలిపారు. వీరికి నోటిఫికేషన్ లో జారీ చేసిన ఆదేశాల ప్రకారం దగ్గర్లోని జిల్లా పరీక్షా కేంద్రాలను కేటాయిస్తామని, ఒక వేళ ఆ సెంటర్లలో పరిమితికి మించితే తదుపరి జిల్లా పరీక్షా కేంద్రాలను కేటాయిస్తామన్నారు.
ఈనెల 5న మధ్యాహ్నం 12 గం.ల నుంచి టెట్ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్ ఎ.సుబ్బారెడ్డి అభ్యర్థులకు సూచించారు.