Narendra Modi: ప్రపంచంలోనే ఇది పెద్ద జోక్: మోదీపై చంద్రబాబు విసుర్లు
- మోదీ తీరుతో బ్యాంకింగ్ వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది
- ట్రిపుల్ తలాక్ పేరుతో కేసులు పెట్టాలనుకున్నారు
- ప్రతి అకౌంట్ లో రూ. 15 లక్షలు వేస్తామన్నారు
ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లీటరు పెట్రోల్ ధరను ఒక్క పైసా తగ్గించడం ప్రపంచలోనే ఒక పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. మోదీ అనుసరిస్తున్న విధానాలతో బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం అతలాకుతలం అయిందని విమర్శించారు. జీఎస్టీ పేరుతో చిన్నా, పెద్దా అందరినీ వేధిస్తున్నారని మండిపడ్డారు. ఒక్కొక్కరి అకౌంట్ లో రూ. 15 లక్షలు వేస్తానన్న మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతు సమస్యలను మోదీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని... ఆయన దారుణమైన పాలనకు వ్యతిరేకంగా 10 రాష్ట్రాల్లో రైతులు ఆందోళన చేస్తున్నారని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకడం లేదని విమర్శించారు.
ట్రిపుల్ తలాక్ పేరుతో కేసులు పెట్టాలని భావించారని... కేసులు వద్దని తాను అడ్డుకున్నానని చంద్రబాబు అన్నారు (ట్రిపుల్ తలాక్ బిల్లుకు సంబంధించి పార్లమెంటులో చర్చ జరిగిన సందర్భంలో... ఎన్టీయే కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ మద్దతు ప్రకటించని సంగతి తెలిసిందే). బీజేపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. మోదీవి అన్నీ ఉత్తుత్తి మాటలేనని, చేతల్లో ఏమీ లేదని దుయ్యబట్టారు. ఆనాడు స్వాతంత్ర్య ఉద్యమానికి కొందరు తూట్లు పొడిచినట్టే... ఇప్పుడు ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. కుట్ర రాజకీయాలపై ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.