exam: పరీక్షకు లాంగ్ స్లీవ్స్ డ్రెస్ వేసుకొచ్చిన బాలికలు.. కత్తిరించిన ఉపాధ్యాయుడు.. ఫొటో వైరల్
- చత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నందగావ్‌లో ఘటన
- అరచేతుల వరకు ఉన్న పొడవాటి డ్రెస్ వేసుకు రావద్దన్న టీచర్
- స్పందించి విచారణకు ఆదేశించిన కలెక్టర్
ఓ బాలిక లాంగ్ స్లీవ్స్ డ్రెస్ వేసుకుని పరీక్ష రాసేందుకు రావడంతో, అలా రాకూడదంటూ ఉపాధ్యాయుడు వాటిని కత్తిరించిన ఘటన చత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నందగావ్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో ఈ ఘటన వెలుగులోకొచ్చింది. ఆ ప్రాంతంలో గతనెల 31న ప్రీ అగ్రికల్చర్ టెస్ట్ (సీజీ పాట్) నిర్వహించారు. తాను చాలా స్ట్రిక్ట్ అంటూ పరీక్షల్లో కాపీ కొట్టే చాన్సే ఇవ్వనంటూ ఓ ఉపాధ్యాయుడు గేటు వద్ద విద్యార్థులను తనిఖీలు చేసి లోపలికి పంపుతున్నాడు.
అయితే, ఓ బాలిక అరచేతుల వరకు ఉన్న పొడవాటి డ్రెస్ వేసుకు రావడంతో అందులో చిట్టీలు పెట్టుకుని వచ్చిందేమోనన్న అనుమానంతో సదరు ఉపాధ్యాయుడు కత్తెరతో వాటిని కత్తిరించాడు. ఆ తర్వాత అలాంటి డ్రెస్ లు వేసుకొని వచ్చిన వారందరి దుస్తులను ఆయన ఇలాగే కట్ చేసినట్లు తెలిసింది. దీంతో విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఈ ఘటనపై ఆ జిల్లా కలెక్టర్ స్పందించి, విచారణకు ఆదేశించారు.