TTD: ఏపీకి కేంద్రం శుభవార్త.. జీఎస్టీ పరిధి నుంచి శ్రీవారి ఆలయానికి మినహాయింపు!
- రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్రం అంగీకారం
- జీఎస్టీ మినహాయింపుతో టీటీడీకి ఏటా రూ.35 కోట్లు మిగులు
- హర్షం వ్యక్తం చేస్తున్న పాలక మండలి
జీఎస్టీ పరిధి నుంచి టీటీడీకి మినహాయింపు ఇవ్వాలన్న ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్రం ఎట్టకేలకు స్పందించింది. తిరుమల శ్రీవారి ఆలయానికి జీఎస్టీ మినహాయింపు ఇస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘సేవా భోజ్ యోజన’ పథకం కింద భక్తులకు ఉచిత అన్న ప్రసాదాలు అందించే ఆలయాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు పేర్కొంది. ఇందులో భాగంగా భక్తుల అన్నప్రసాదాల కోసం కొనుగోలు చేసే ముడి సరుకులపై ఇక నుంచి ఎటువంటి జీఎస్టీ ఉండదు.
జీఎస్టీ మినహాయింపుతో టీటీడీకి ఏడాదికి రూ.35 కోట్ల వరకు ఆదా అవుతుందని అంచనా. టీటీడీ ఆలయానికి జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని ఏపీ పలుమార్లు కోరినా, కేంద్రం తిరస్కరించింది. ఈ క్రమంలో తాజాగా ఈ మినహాయింపు ప్రకటన రావడంతో టీటీడీ పాలకవర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.