Donald Trump: ట్రంప్ సమాధానంతో విస్తుపోయిన మీడియా ప్రతినిధులు!
- మీడియా ప్రతినిధులకు ట్రంప్ షాక్
- కిమ్ లేఖను చదవకుండానే బాగుందని ప్రశంస
- ఈ నెల 12న ట్రంప్-కిమ్ భేటీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు మీడియాకు షాకిచ్చారు. ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ పంపిన లేఖ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్టు రెండు రోజుల క్రితం చెప్పిన ట్రంప్ ఆ లేఖను చదవకుండానే బాగుందని తేల్చేశారు. శనివారం లేఖను అందుకున్న ట్రంప్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లేఖ చాలా బాగుందని, ఆసక్తికరంగా ఉందని పేర్కొన్నారు.
కిమ్ ఆ లేఖలో ఏం రాశారని మీడియా ప్రశ్నించడంతో విచిత్రమైన సమాధానం చెప్పారు. కిమ్ ఏం రాశారో తనకు తెలియదని, దానిని ఇంకా తెరవనే లేదని చెప్పడంతో మీడియా ప్రతినిధులకు మతిపోయినంత పనైంది. అందులో ఏం రాసుందో చదవకుండానే లేఖ బాగుందని చెప్పడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. కాగా, ఈనెల 12న సింగపూర్లో ట్రంప్-కిమ్ భేటీ కానున్నారు. ఉత్తర కొరియా చర్యల కారణంగా తొలుత ఈ భేటీకి హాజరు కాబోవడం లేదని ప్రకటించి ఆశ్చర్యపరిచిన ట్రంప్.. తర్వాత చర్చలకు అంగీకరించారు. వీరి భేటీ కోసం ఏర్పాట్లు త్వరితగతిన జరుగుతున్నాయి.