Pawan Kalyan: 25 కోట్లు ట్యాక్స్ కడుతున్నా.. తృప్తి మాత్రం లేదు!: పవన్ కల్యాణ్
- కోట్లు ఇవ్వలేని ఆనందం ప్రజా సేవలోనే ఉందని నమ్మాను
- ఎంపీ, ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని ఆఫర్ చేశారు
- పదవులు ఒకరిచ్చేదేమిటి.. నేనే గెలుచుకుంటా
సినిమా షూటింగ్ లకు వెళ్లినా, తాను ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించే ఆలోచిస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఎంతో సంపాదన ఉన్నప్పటికీ, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. రూ. 25 కోట్లు ట్యాక్స్ కడుతున్నా, తనకు ఏమాత్రం తృప్తి కలుగలేదని... కోట్లు ఇవ్వలేని ఆనందం ప్రజా సేవలోనే ఉందని నమ్మి ప్రజా జీవితంలోకి వచ్చానని తెలిపారు.
ఎంపీ, ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని తనకు ఆఫర్ చేశారని... ఆ పదవులు తనకు ఒకరిచ్చేదేమిటని, వాటిని నేనే గెలుచుకుంటానని చెప్పారు. ప్రజల మద్దతు ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. విజయనగరంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విజయనగరానికి స్మార్ట్ సిటీ అవార్డు ఎలా వచ్చిందో తనకు అర్థం కావడం లేదని... ఎక్కడ చూసినా కుక్కలు, పందులే కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు.