jc diwakar reddy: వైయస్ రాజారెడ్డి ఒకరిని చంపి, వాళ్ల ఆస్తిని లాక్కోలేదా?: జేసీ దివాకర్ రెడ్డి
- నేను మాట్లాడిన ప్రతి మాటను నిరూపిస్తా
- కుక్కలు మొరిగితే.. నేను స్పందించను
- నాకు పుట్టినవాళ్లే నా శవయాత్ర నిర్వహిస్తారు
వైయస్ కుటుంబంపై అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. వైయస్ రాజశేఖరరెడ్డి తండ్రి వైయస్ రాజారెడ్డి మంగంపేటకు వెళ్లి, ఒకరిని చంపి, వాళ్ల ఆస్తిని లాక్కోలేదా? అని జేసీ ప్రశ్నించారు. వాస్తవాలు మాట్లాడితే తనకు శవయాత్రలు నిర్వహిస్తారా? అంటూ మండిపడ్డారు. తనకు శవయాత్ర చేయడానికి వీళ్లంతా ఎవరు? తనకు పుట్టినవారు అయితేనే తనకు శవయాత్ర చేస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పూటకో పార్టీ మారేవారు కూడా నన్ను విమర్శిస్తారా? అంటూ మండిపడ్డారు. రోడ్డుపై వెళ్లే కుక్కలు మొరిగితే, వాటికి స్పందించాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. తాను మాట్లాడిన ప్రతి మాటనూ, సాక్షాధారాలతో సహా నిరూపిస్తానని... ఎవరైనా తను ముందుకు రావచ్చని సవాల్ విసిరారు.
జానీవాకర్ మందు తాగి మాట్లాడానని తనను కొందరు విమర్శిస్తున్నారని... తన కుటుంబంలో మందు తాగే అలవాటు ఎవరికీ లేదని జేసీ చెప్పారు. మందు తాగే అలవాటు ఉన్నవారే అలాంటి విమర్శలు చేస్తారని అన్నారు. ఒకరిపై లేనివి ఉన్నట్టుగా చెప్పే అలవాటు తనకు లేదని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ కు సంబంధించి తాను అబద్ధాలు మాట్లాడలేదని అన్నారు. జగన్ గురించి దుర్మార్గంగా తానెక్కడా వ్యాఖ్యానించలేదని చెప్పారు. తనపై విమర్శలు చేసే అర్హత ఏ ఒక్కరికీ లేదని అన్నారు.