JC Diwakar Reddy: జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలపై రాజుకుంటున్న దుమారం!
- అనంతపురంలో జేసీ శవయాత్ర
- దిష్టి బొమ్మను దగ్ధం చేసిన దళిత సంఘాలు
- కొడుకులే శవయాత్ర, దహనం చేస్తారన్న జేసీ
- మండిపడుతున్న దళిత నేతలు
గతవారం జరిగిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవం మహానాడు వేదిక నుంచి అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రసంగిస్తూ, ఎరుకల కులస్తులను కించపరిచేలా మాట్లాడారని ఆరోపిస్తూ, గిరిజనులు అనంతపురంలో నిరసనలు తెలియజేయగా, ఆపై జేసీ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపుతున్నాయి.
జేసీ దిష్టిబొమ్మకు శవయాత్ర జరిపిన దళిత, గిరిజనులు ఆపై దాన్ని దగ్ధం చేయగా, తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ జేసీ స్పందించారు. తన శవయాత్ర చేశారని గుర్తు చేసిన ఆయన, శవయాత్ర చేసేది కొడుకులేనని, ఆపై దహనం చేసేది కూడా వారేనని అన్నారు. "నాకు జిల్లాలో ఇంతమంది కొడుకులా? ఎప్పుడు కనింటినో ఏమో... నాకే తెలియదు" అని వ్యాఖ్యానించారు. దీంతో జేసీ వ్యాఖ్యలపై దళిత సంఘాలు తీవ్రంగా మండిపడుతూ, తాను ప్రజా ప్రతినిధినన్న స్పృహ కూడా లేకుండా మొత్తం దళిత జాతిని ఆయన కించపరుస్తున్నారని ఆరోపించారు.