Agni-5: అగ్ని-5 క్షిపణి పరీక్ష విజయవంతం.. టార్గెట్ ఐదు వేల కిలోమీటర్లు!
- లక్ష్యాన్ని ఛేదించిన అగ్ని-5
- ఇప్పటికే పలు మార్లు పరీక్షలను ఎదుర్కొన్న అగ్ని
- ఇక చైనా మొత్తం అగ్ని రేంజ్ లోకి!
భారత రక్షణ రంగ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని శాస్త్రవేత్తలు నేడు నమోదు చేశారు. ఈ ఉదయం ఒడిశా తీరంలోని డాక్టర్ అబ్దుల్ కలాం దీవి నుంచి ప్రయోగించిన అగ్ని-5 క్షిపణి పరీక్ష విజయవంతం అయిందని రక్షణ శాఖ వర్గాలు ప్రకటించాయి. అణు బాంబులను మోసుకుని వెళుతూ, 5 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి, ఉపరితలంపై ఉన్న లక్ష్యాలను ఇది సులువుగా ఛేదిస్తుందని వెల్లడించారు. లాంచ్ ప్యాడ్-4 పై నుంచి ఉదయం 9.48 గంటల ప్రాంతంలో దీన్ని ప్రయోగించామని, పూర్తి దూరాన్ని ఇది ప్రయాణించి, లక్ష్యాన్ని తాకిందని అధికారులు తెలిపారు.
కాగా, ఇప్పటివరకూ అగ్ని-5 క్షిపణిని డీఆర్డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్) ఆరు సార్లు ప్రయోగాత్మకంగా పరిశీలించింది. తొలి పరీక్షను 2012 ఏప్రిల్ 19న జరుపగా, చివరిగా ఈ సంవత్సరం జనవరి 18న ప్రయోగించింది. నేడు జరిపిన పరీక్ష ఆరోది. క్షిపణి వెళ్లిన మార్గాన్ని, వేగాన్ని రాడార్లు, ట్రాకింగ్ పరికరాలు, అబ్జర్వేషన్ స్టేషన్లు అనుక్షణం పరిశీలించాయని అధికారులు తెలిపారు. 17 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు ఉన్న ఈ మిసైల్ బరువు లాంచింగ్ సమయంలో 50 టన్నుల వరకూ ఉంటుందని, చాలా సులువుగా టన్ను బరువున్న న్యూక్లియర్ వార్ హెడ్ లను మోసుకు వెళుతుందని వెల్లడించారు.
మిగతా అగ్ని శ్రేణిలోని క్షిపణులతో పోలిస్తే, ఇది మరింత అత్యాధునికమైనదని, ఇంజన్, నావిగేషన్, గైడెన్స్, వార్ హెడ్ తదితరాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించామని తెలిపారు. అత్యంత కచ్చితత్వాన్ని చూపే ఆక్యురేట్ మైక్రో నావిగేషన్ సిస్టమ్ దీని ప్రత్యేకతని, లక్ష్యాన్ని గురి చూసి కొడుతుందని అన్నారు.
కాగా, 'అగ్ని-1' 700 కి.మీ., 'అగ్ని-2' 2000 కి.మీ., 'అగ్ని-3', '4' వెర్షన్లు 2,500 కి.మీ. నుంచి 3,500 కి.మీ. లక్ష్యాలను విజయవంతంగా ఛేదించగలవు. అగ్ని-5 వెర్షన్ కు మరిన్ని పరీక్షలు నిర్వహించాలని డీఆర్డీఓ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. తాజా విజయంతో అమెరికా, చైనా, రష్యాల సరసన భారత్ కూడా చేరినట్లయింది. ఈ క్షిపణి దాదాపు చైనా మొత్తాన్నీ కవర్ చేస్తుంది. జమ్మూ కాశ్మీర్ నుంచి ప్రయోగిస్తే, రష్యాలోని అత్యధిక ప్రాంతాలు దీని రేంజ్ లోకి వస్తాయి.