Chandrababu: రెండు జాతీయ పార్టీలు రాష్ట్రానికి అన్యాయం చేశాయి: చంద్రబాబు
- రాష్ట్రాన్ని కాంగ్రెస్ హేతుబద్ధత లేకుండా విడదీసింది
- బీజేపీ నమ్మక ద్రోహం చేసింది
- రాష్ట్రం మొత్తం నవనిర్మాణ దీక్ష
- జొన్నగిరిలో నవనిర్మాణ దీక్షలో చంద్రబాబు
రెండు జాతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం చేశాయని, రాష్ట్రాన్ని కాంగ్రెస్ హేతుబద్ధత లేకుండా విడదీసిందని, బీజేపీ నమ్మక ద్రోహం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో నవనిర్మాణ దీక్షలో చంద్రబాబు పాల్గొన్నారు. వారం రోజుల పాటు కొనసాగనున్న ఈ దీక్షలో భాగంగా రెండో రోజయిన ఈరోజు నీటి భద్రత-కరవు రహిత రాష్ట్రం అనే అంశంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... రాష్ట్రం మొత్తం నవనిర్మాణ దీక్ష చేపట్టామని అన్నారు. ఏపీకి అన్యాయం చేసిన వారు అసూయతో కుళ్లుకునేలా అభివృద్ధి సాధిస్తూ పని చేయాలని పిలుపునిచ్చారు. కాగా, కర్నూలు జిల్లాలో 68 చెరువులను నీటితో నింపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. అధికారంలోకి రాగానే కరెంటు కొరత లేకుండా చేశామని చెప్పారు.
ఏపీలో ఉపాధి హామీ, జనవనరుల శాఖలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున పనులు చేపట్టామని అన్నారు. పంట సంజీవని కింద 7.25 లక్షల పంట కుంటలు తవ్వామని అన్నారు.