Mumbai: ముంబై ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో అగ్నిప్రమాదం... మాల్యా, నీరవ్ ఫైల్స్ సేఫంటున్న అధికారులు!
- మంటలు విస్తరించక ముందే ఫైల్స్ తరలించాం
- వెల్లడించిన ఐటీ అధికారులు
- మంటలను అదుపు చేసేందుకు శ్రమించిన 120 మంది
ముంబైలోని స్కాండియా హౌస్ లో ఉన్న ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం జరుగగా, ఇదే కార్యాలయంలో దాచి వుంచిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మేహుల్ చౌక్సీ తదితర డిఫాల్టర్ల దస్త్రాలు క్షేమంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. అగ్ని ప్రమాదం జరిగిన వేళ, ముఖ్యమైన ఫైల్స్ అన్నింటినీ అక్కడి నుంచి తరలించామని తెలియజేశారు. భవంతిలోని మూడు, నాలుగు, ఐదో అంతస్తుల్లో దాదాపు 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఐటీ శాఖ కార్యాలయంలో బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన బడాబాబులకు సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయి.
మంటలు ప్రారంభం కాగానే, భవంతిలో చిక్కుకున్న ఆరుగురిని ప్రాణాలతో రక్షించామని, దాదాపు 120 మంది ఫైర్ మెన్లు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకు వచ్చారని డిప్యూటీ ఫైర్ ఆఫీసర్ రాజేంద్ర చౌదరి వెల్లడించారు. ప్రమాదంలో ఆస్తి నష్టమే తప్ప, ప్రాణనష్టం జరగలేదని చెప్పారు. కాగా, ఏ కారణంతో భవనానికి నిప్పంటుకుందన్న విషయమై పోలీసులు విచారణ ప్రారంభించారు.