ttd: టీటీడీ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు న్యాయవాదులతో స్వామి మంతనాలు!
- ప్రభుత్వ నియంత్రణ తొలగించాలని కోరుతూ పిటిషన్ వేయనున్న సుబ్రహ్మణ్య స్వామి
- వ్యాజ్యాన్ని సిద్ధం చేస్తున్నట్టు ట్వీట్ ద్వారా వెల్లడి
- చెన్నైలో న్యాయవాదులతో సంప్రదింపులు జరిపిన ఫొటో సైతం పోస్ట్
తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కారుకు వ్యతిరేకంగా బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయ నిపుణుడు సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టుకు వెళ్లడం దాదాపుగా ఖాయం అనిపిస్తోంది. ఈ విషయమై ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నట్టు ఇప్పటికే స్పష్టం చేశారు. పిటిషన్ ను సిద్ధం చేస్తున్నానంటూ ఆయన తాజాగా ట్వీట్ చేశారు. పిటిషన్ వేసే ముందుగా సుబ్రహ్మణ్యస్వామి చెన్నైలోని తన న్యాయవాద బృందమైన మోహన్ దాస్ టీజీ, టీఆర్ రమేష్, ఆర్ రవితో సంప్రదింపులు జరిపిన విషయాన్ని ఫొటో తీసి మరీ ట్విట్టర్లో పోస్ట్ చేయడం గమనార్హం. తిరుమల తిరుపతి దేవస్థానంపై ప్రభుత్వ నియంత్రణను తొలగించాలని కోరుతూ ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేయనున్నట్టు సుబ్రహ్మణ్యస్వామి తన ట్వీట్ లో పేర్కొన్నారు.