Chandrababu: కేంద్రానికి మమ్మల్ని చూస్తే భయం.. వాళ్లని చూస్తే లోకువ!: చంద్రబాబు
- కేంద్ర ప్రభుత్వ ధీమా ఏంటీ?
- ఐదుకోట్ల మంది మనోభావాలతో ఆడుకుంటున్నారు
- వైసీపీ నేతలు ఎన్నో డ్రామాలు ఆడుతున్నారు
- ఢిల్లీలో మోదీ కాళ్లు పట్టుకుంటున్నారు
'కేంద్ర ప్రభుత్వ ధీమా ఏంటీ? ఐదుకోట్ల మంది మనోభావాలతో ఆడుకుంటున్నారు' అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి తమ టీడీపీని చూస్తే భయమని.. వైసీపీ వాళ్లని చూస్తే లోకువ అని అన్నారు. ఎందుకంటే వారిపై 12 చార్జిషీట్లు ఉన్నాయని చెప్పారు. ఈరోజు విజయనగరం జిల్లా లక్కవరపు కోట మండలం జమ్మాదేవిపేటలో గ్రామదర్శినిలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. వైసీపీ నేతలు ఎన్నో డ్రామాలు ఆడుతున్నారని, ఢిల్లీలో మోదీ కాళ్లు పట్టుకుంటున్నారని అన్నారు.
కష్టపడి చేసింది శాశ్వతమని, అవినీతితో సంపాదించింది అశాశ్వతమని చంద్రబాబు అన్నారు. ధర్మంగా సంపాదించాలని హితవు పలికారు. "నవనిర్మాణ దీక్ష పెట్టాను. ఎందుకో తెలుసా? మనకి అన్యాయం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు.. ఇవ్వలేదు. 29 సార్లు ఢిల్లీకి వెళ్లాను.. పోరాడడం తప్ప వేరే మార్గం లేదు. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణలో ఉత్సవాలు చేసుకున్నారు. కానీ మనం చేసుకోవడానికి వీల్లేదు.. మనం నష్టపోయాం.. ఐదు కోట్ల మందిలో చైతన్యం తీసుకురావడానికే ఈ నవనిర్మాణ దీక్ష చేపట్టాం" అని వ్యాఖ్యానించారు.