london: 200 ఏళ్ల నాటి భారత రెస్టారెంట్ మెనూ.. వేలం పాటలో రూ.7.58 లక్షలు పలికిన వైనం!
- 1810లో లండన్ లో ఇండియన్ రెస్టారెంట్ ప్రారంభించిన దీన్ మహ్మద్
- చేతి రాతతో ఉన్న రెస్టారెంట్ మెనూ
- బ్రిటీష్ సైన్యంలో పని చేసిన మహ్మద్
లండన్ లో 200 ఏళ్ల క్రితం ఉన్న ఓ భారతీయ రెస్టారెంట్ మెనూ కార్డ్ వేలం పాటలో ఏకంగా రూ. 7.58 లక్షలు పలికింది. వివరాల్లోకి వెళ్తే లండన్ లోని జార్జ్ వీధిలో 1810లో పాట్నాకు చెందిన దీన్ మహ్మద్ అనే వ్యక్తి మొట్టమొదటి భారతీయ రెస్టారెంట్ ను ప్రారంభించారు. ఈ రెస్టారెంటులో పలు రకాల భారతీయ రుచులను అందించారు. ఈ రెస్టారెంట్ కు సంబంధించిన మెనూ కార్డును చేతితో రాశారు. ఈ మెనూలో 25 రకాల వంటలు, వాటి ధరలు ఉన్నాయి. వీటిలో చికెన్, మటన్, పీతల వంటకాలు కూడా ఉన్నాయి.
1759లో దీన్ మహ్మద్ జన్మించారు. విదేశాలకు వలస వెళ్లిన వారిలో ఈయన ముందు తరానికి చెందినవారు. బ్రిటీష్ పాలనలోని ఆర్మీలో ఆయన పని చేశారు. అనంతరం బ్రిటన్ కు వెళ్లారు. 'ది ట్రావెల్స్ ఆఫ్ డీన్ మాహోమెట్' పుస్తకాన్ని ఆయన రాశారు. ఇంగ్లీషులో ఓ భారతీయుడు రాసిన తొలి పుస్తకంగా దీని గురించి చెప్పుకుంటారు. బ్రిటన్ లో తొలి భారతీయ రెస్టారెంట్ ను ప్రారంభించింది కూడా ఈయనే.