Nara Lokesh: బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావుపై మండిపడ్డ ఏపీ మంత్రి లోకేశ్
- యూసీలు సరిగ్గాలేవని అనడానికి జీవీఎల్ ఎవరు?
- యూసీల సమర్పణ, ఆమోదం అన్నీ జరిగిపోయాయి
- అవి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మధ్యే జరుగుతాయి
- హోదా ఇవ్వడానికి యూసీల సమర్పణ అవసరం లేదు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోన్న బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావుపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్లో మండిపడ్డారు. కేంద్ర సర్కారుకి ఏపీ ప్రభుత్వం అందించిన యూసీలు సరిగ్గాలేవని అనడానికి జీవీఎల్ ఎవరని ప్రశ్నించారు. వెనకబడిన జిల్లాల్లో ఖర్చు పెట్టిన రూ.1000 కోట్లకు సంబంధించిన యూసీలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కేంద్రానికి సమర్పించారని, వాటిని సంబంధిత కేంద్ర ప్రభుత్వ అధికారులు ఇప్పటికే ఆమోదించారని అన్నారు.
అలాగే, అమరావతికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.1500 కోట్ల నిధులకు సంబంధించి కూడా యూసీలను పంపామని లోకేశ్ చెప్పారు. యూసీలు సమర్పించడం, ఆమోదించడం అనే పరిపాలనా ప్రక్రియలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మధ్యే జరుగుతాయని అన్నారు.
కానీ, ఈ అంశాన్ని బీజేపీ రాజకీయం చేస్తూ.. నిధులను ఏపీ సర్కారు దుర్వినియోగం చేస్తోందంటూ ప్రచారం చేస్తోందని, సీఎం చంద్రబాబు ఇమేజ్‌ని దెబ్బతీయాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని లోకేశ్ అన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా హామీని అమలు చేయడానికి, ఏపీ యూసీలు సమర్పించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.