petrol: అందుకే, జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి.. రాష్ట్రాలు సమ్మతించాలి: పెట్రోల్ ధరలపై ధర్మేంద్ర ప్రధాన్
- దీర్ఘకాల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాం
- రాష్ట్ర ప్రభుత్వాలు సహేతుకంగా, బాధ్యతగా ట్యాక్స్ వేయాలి
- నాలుగు రోజులుగా భారత్‌లో ధరలు తగ్గుముఖం పట్టాయి
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతోందని, దీర్ఘకాల పరిష్కారం కోసం కృషి చేస్తోందని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఈరోజు ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... పెట్రోల్, డీజిల్‌లపై రాష్ట్ర ప్రభుత్వాలు సహేతుకంగా, బాధ్యతగా ట్యాక్స్ వేయాలని, ధరలు పెరిగిన కొద్దీ ట్యాక్స్ కూడా పెంచడం మంచిది కాదని అన్నారు.
అంతర్జాతీయంగా చమురు మార్కెట్లో హెచ్చుతగ్గుల ఆధారంగా భారత్‌లో పెట్రో ధరలు ఉంటాయని ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. నాలుగు రోజులుగా భారత్‌లో ధరలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. గత యూపీఏ ప్రభుత్వం 2010-2014 మధ్య చమురు ఆర్థిక వ్యవస్థను సరిగ్గా నిర్వహించలేదని, ఆ కారణంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆయిల్ బాండ్లకు కొన్ని చెల్లింపులు చేయాల్సి వస్తోందని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను సమర్థవంతంగా నియంత్రించడానికే తాము దాన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనుకుంటున్నామని, అయితే, ఇందుకు రాష్ట్రాలు సమ్మతించాలని అన్నారు.