tet: కెపాసిటీ ప్ర‌కారమే సెంట‌ర్ల కేటాయింపు.. పత్రికల్లో వచ్చిన వార్తలపై ఏపీ టెట్‌ కన్వీనర్‌ స్పందన

  • సెంట‌ర్ల మార్పున‌కు అవ‌కాశం లేదు
  • ఆప్ష‌న్లు ఇచ్చిన వారు 96.5 శాతం మంది కాగా, ఇవ్వని వారు 3.5 శాతం
  • ఫ‌స్ట్ క‌మ్ ఫ‌స్ట్ సర్వ్ ప‌ద్ధ‌తిలో సెంట‌ర్ల కేటాయింపు
  • జిల్లాల్లో సీటింగ్ కెపాసిటీని బ‌ట్టే ప‌రీక్షా కేంద్రాలు 

మారుతున్న స‌మాజ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష‌ (టెట్) ను మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా ఆన్ లైన్ లో నిర్వ‌హిస్తున్నామ‌ని టెట్ క‌న్వీన‌ర్ ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. ఆన్ లైన్ ప‌రీక్షా కేంద్రాల సీటింగ్ సామ‌ర్థ్యం ఆధారంగానే అభ్య‌ర్థుల ఆప్ష‌న్ల ప్ర‌కారం సెంట‌ర్ల ఎంపిక వుంటుంద‌ని, ఇందులో ఎవరి ప్ర‌మేయం వుండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

ఆప్ష‌న్లు సూచించ‌ని అభ్య‌ర్థుల‌కు సుదూర ప్రాంతాల్లో సెంట‌ర్లు ఇచ్చారంటూ కొన్ని పత్రిక‌ల్లో వ‌చ్చిన క‌థ‌నాల‌పై ఆయ‌న స్పందించారు. ఈ మేర‌కు ఈరోజు ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆన్ లైన్ సెంట‌ర్లు కెపాసిటీ ప్ర‌కారమే సెంట‌ర్ల కేటాయింపు వుంటుంద‌ని తెలిపారు. మొత్తం 3,97,957 మంది టెట్ కు ద‌ర‌ఖాస్తు చేసుకోగా 3,83,066 మంది ఆప్ష‌న్లు పెట్టారని, ఆప్ష‌న్లు సూచించని 14891 అభ్య‌ర్థుల‌కు టెట్ నోటిఫికేష‌న్ ప్ర‌కారం వారికి ద‌గ్గ‌ర‌గా వున్న జిల్లా కేంద్రాల‌ను విద్యాశాఖ‌నే  కేటాయించింద‌ని టెట్ క‌న్వీన‌ర్ తెలిపారు.

ఆప్ష‌న్లు ఇవ్వ‌ని అభ్య‌ర్థులకు వారికి ద‌గ్గ‌ర్లోని జిల్లా ప‌రీక్షా కేంద్రాలు.. ఒక‌వేళ ప‌రిమితికి మించితే ఇత‌ర జిల్లాల్లో సెంట‌ర్లు కేటాయించామ‌ని అంతేగానీ సుదూర ప్రాంతాల్లో కేటాయించ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఆప్ష‌న్లు పెట్టుకోవాల‌ని మే 24 నుంచి మే 30 సాయంత్రం వ‌ర‌కు టెట్ అభ్య‌ర్థుల మొబైళ్ల‌కు సంక్షిప్త సందేశాలు పంపామ‌ని, మొత్తం 33,98,135 ల‌క్ష‌ల సందేశాలు పంపామని అన్నారు. నోటిఫికేష‌న్ లో సెంట‌ర్ల ఆప్ష‌న్ల స‌మాచారాన్ని ఇవ్వ‌డంతో పాటు మీడియాలో కూడా విస్త్రతంగా ప్ర‌చారం చేశామ‌న్నారు.

ప్ర‌భుత్వ సంస్థ ఎపీ ఆన్ లైన్ భాగ‌స్వామ్యంతోనే టెట్ నిర్వ‌హిస్తున్నామ‌ని సుబ్బారెడ్డి తెలిపారు. త‌మిళ‌నాడులో 2,  హైద‌రాబాద్ లో 6, బెంగ‌ళూరులో 4 ప‌రీక్షా కేంద్రాల‌ను కేటాయించామ‌ని వీటిలో కూడా కొంత‌మంది అభ్య‌ర్థులు ఆప్ష‌న్లు పెట్టుకొన్నార‌ని చెప్పారు. అభ్య‌ర్థులు స్వ‌యంగా బెంగ‌ళూరులో 6,859, చెన్నైలో 738, హైద‌రాబాద్ లో 16,325 మంది మొత్తం 23 వేల‌ మంది ఆప్ష‌న్లు పెట్టుకొన్నార‌ని అన్నారు. వారు ఆయా ప్రాంతాల్లో వుండ‌ట‌ం లేక ఆయా ప్రాంతాల‌కు ద‌గ్గ‌ర‌గా వుండ‌టం వ‌ల్లే సెంట‌ర్లు త‌మ ఇష్ట‌పూర్వ‌కంగా పెట్టుకొన్నార‌ని తెలిపారు.

రేపు మ‌.12 గం.ల నుంచి హాల్ టిక్కెట్ల‌ డౌన్ లోడ్..

సెంట‌ర్ల మార్పున‌కు అవ‌కాశం లేద‌ని, ఆప్ష‌న్ల‌ను సూచించ‌ని వారికి అభ్య‌ర్థులకు ఇబ్బంది క‌ల‌గని రీతిలో సెంట‌ర్ల కేటాయింపు జ‌రిపామ‌ని టెట్ క‌న్వీన‌ర్ తెలిపారు. రేపు మ‌.12 గం.ల నుంచి హాల్ టిక్కెట్ల‌ను డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చ‌ని, ఒక్క‌సారి డౌన్ లోడ్ చేసుకున్న త‌ర్వాత ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పేప‌ర్, స‌బ్జెక్టు, మీడియంల మార్పు జ‌ర‌గ‌ద‌ని టెట్ క‌న్వీన‌ర్ స్ప‌ష్టం చేశారు. కేటాయించిన సెంట‌ర్ల‌కు ప‌రీక్షా ప్రారంభానికి ఒక్క గంట ముందే చేరుకోవాల‌ని, నిమిషం ఆల‌స్య‌మైనా ప‌రీక్షకు అనుమ‌తించ‌మ‌ని తెలిపారు. 

  • Loading...

More Telugu News