Anantapur District: మా ఊరి పేరు మార్చండి బాబోయ్... అధికారులకు గ్రామస్తుల మొర!
- అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో కొజ్జేపల్లి
- పేరు మార్చాలని దశాబ్దాలుగా డిమాండ్
- ఊరి పేరు చెప్పుకోలేకపోతున్నామని వాపోతున్న ప్రజలు
మీ ఊరి పేరేంటని ఎవరైనా అడిగితే, స్వగ్రామం పేరును గర్వంగా చెబుతాం. కానీ, అనంతపురం జిల్లా గుత్తికి సమీపంలో ఉన్న ఆ ఊరి వాసులు మాత్రం జంకుతారు. తమను ఎక్కడ గేలి చేస్తారోనని ఊరి పేరు చెప్పేందుకు సిగ్గుపడతారు. గుత్తికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం 'కొజ్జేపల్లి'... ఆ ఊరు అభివృద్ధి పథంలో ముందంజలో ఉన్నా, పేరు చెప్పుకునేందుకు అక్కడి వారు ఇష్టపడని పరిస్థితి. ఆ పేరు వింటే, అక్కడందరూ హిజ్రాలే ఉంటారా? అంటూ టాపిక్ ఆ రూట్ లోకి వెళ్లిపోతుంది.
ఈ గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? వ్యాసరాయల పాలన కాలంలో కొందరు హిజ్రాలు ఈ ప్రాంతంలో గుడిసెలు వేసుకుని నివసించగా, కాల క్రమంలో కొజ్జాపల్లిగా ఆపై కొజ్జేపల్లిగా ఊరి పేరు మారింది. ఇక గ్రామం పేరును 1980వ దశకంలోనే గాంధీ నగర్ గా మారుస్తున్నట్టు ప్రకటించిన అప్పటి ఎమ్మెల్యే వెంకట్రామయ్య, కలెక్టర్ తదితర అధికారులకు లేఖలు రాయగా, నాలుగు దశాబ్దాలు గడుస్తున్నా అది కార్యరూపం దాల్చలేదు. ఏదైనా వేరే ఊరికి వెళ్లి తమ గ్రామం పేరు చెప్పుకోవాల్సి వస్తే తల కొట్టేసినట్టు అనిపిస్తుంటుందని గ్రామస్తులు వాపోతున్నారు. పేరు మార్చాలని పంచాయతీ తీర్మానం చేసినా ఫలితం లేకపోయిందని, ఇప్పటికైనా అధికారులు తమ సమస్యను పరిష్కరించాలని మొరపెట్టుకుంటున్నారు.