Osmania University: ఉస్మానియాలో అగ్ని ప్రమాదం... జవాబు పత్రాలు దగ్ధం!
- మానేరు హాస్టల్ వెనుకవైపు మూల్యాంకనం గది
- పేపర్ స్టోర్ రూమ్ దగ్ధం
- విద్యార్థుల్లో ఆందోళన
హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో అగ్నిప్రమాదం జరుగగా, పలు పరీక్షల్లో విద్యార్థులు రాసిన ఆన్సర్ షీట్స్ దగ్ధమయ్యాయి. వర్శిటీ పరిధిలోని మానేరు హాస్టల్ వెనుకవైపు ఉన్న పేపర్ స్టోర్ రూమ్ లో మంటలంటుకున్నాయి. మంటలు వ్యాపించడానికి కారణం తెలియదుగానీ, జవాబు పత్రాలన్నీ కాలిపోయాయి. మూల్యాంకనం జరిగే గదికి కూడా మంటలు వ్యాపించాయి.
విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా, ఫలితం లేకపోయింది. ఆన్సర్ షీట్స్ మొత్తం తగులబడి బూడిద కుప్పగా మారాయి. అయితే, ఏఏ పరీక్షల జవాబు పత్రాలు దగ్ధమయ్యాయన్న విషయం ఇంకా తెలియరాలేదు. ఈ వార్తతో పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.