archbishop: రాజ్యాంగం ప్రమాదంలో పడింది.. ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు: గోవా ఆర్చ్ బిషప్ లేఖ
- దేశంలో కొత్త ఒరవడి ప్రారంభమైంది
- తిండి, వేషధారణ అన్నీ ఒకేలా ఉండాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి
- మైనార్టీలు అభద్రతలో ఉన్నారు
- రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అందరూ పోరాడాలి
భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, దేశ ప్రజలు అభద్రతాభావంతో బతుకుతున్నారంటూ గోవా, డామన్ ఆర్చ్ బిషప్ ఫిలిప్ నేరి ఫెర్రారో ఆవేదన వ్యక్తం చేశారు. గోవా, డామన్ ఆర్చ్ డయాసిస్ కు సంబంధించిన క్రిస్టియన్లకు ఈ మేరకు ఆయన లేఖ రాశారు. రాజ్యాంగ విలువలను పరిరక్షించుకునేందుకు, ప్రజలు ఎవరి మతాన్ని వారు అనుసరించేందుకు అందరూ పోరాడాలని లేఖలో పేర్కొన్నారు. సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో, ప్రతి ఒక్కరు రాజ్యాంగం గురించి తెలుసుకోవాలని, దాన్ని కాపాడటానికి మరింత ఎక్కువగా కష్టపడాలని చెప్పారు.
ఇటీవలి కాలంలో మన దేశంలో ఒక కొత్త ఒరవడి ప్రారంభమైందని... తిండి, వేషధారణ, జీవనశైలి, ఆథ్యాత్మికత ఇలా అన్నీ కూడా ఒకేలా ఉండాలనే డిమాండ్లు ఎక్కువవుతున్నాయని ఫిలిప్ తెలిపారు. మానవహక్కులను హరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రజాస్వామ్య హననం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీలంతా వారి భద్రత పట్ల భయాందోళన చెందుతున్నారని అన్నారు. అభివృద్ధి పేరుతో ప్రజలను వారి స్వస్థలాలు, నివాసాల నుంచి వెళ్లగొడుతున్నారని ఆరోపించారు. ఈ దారుణానికి బలవుతున్న తొలి వ్యక్తి పేదవాడే అని అన్నారు. పేదవారు తమ గొంతుకను బలంగా వినిపించలేరని, అందుకే తొలి బలిపశువుగా మారుతున్నారని చెప్పారు.
రెండు వారాల క్రితం ఢిల్లీ ఆర్చ్ బిషప్ అనిల్ కౌటో కూడా ఇదే రీతిలో ఓ లేఖను సంధించారు. దేశ రాజకీయ వ్యవస్థ అల్లకల్లోలంగా ఉందని, దేశం కోసం అందరూ ప్రార్థించాలని ఆ లేఖలో కౌటో పేర్కొన్నారు. ఈ లేఖపై వెంటనే కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా స్పందించారు. మతం, వర్గం తదితర అంశాల ప్రకారం ప్రజలను విభజించే కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని స్పష్టం చేశారు.