china: చదువుల ఒత్తిళ్లతో పోతున్న కంటి చూపు... చైనాలో 80 శాతం టీనేజర్లకు దగ్గరి చూపు సమస్య
- దేశ జనాభాలో 45 కోట్ల మందికి మయోపియా
- 13-19 వయసు వారిలో 80 శాతం మందికి
- కాలేజీ విద్యార్థుల్లో అయితే 90 శాతం బాధితులే
నేటి తరం చిన్నారులు, యువతకు కంటి చూపు పరంగా ముప్పు ఏ స్థాయిలో ఉంటుందో చైనా గణాంకాలు తెలియజేస్తున్నాయి. చైనాలో 19 సంవత్సరాల్లోపు వయసున్న టీనేజర్లలో 80 శాతం మంది దగ్గరి చూపు సమస్యతో బాధపడుతున్నారు. చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ విడుదల చేసిన సమాచారం ఆధారంగా మయోపియా (దీన్నే దగ్గరి చూపు సమస్యగా పేర్కొంటారు) బాధితుల సంఖ్య 45 కోట్లకు చేరుకున్నట్టు ఆ దేశ అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. అంటే చైనా జనాభాలో ఒక వంతు మంది బాధితులేనని తెలుస్తోంది. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం చైనాలో మయోపియా బాధితుల సంఖ్య 60 కోట్లుగా ఉంది. దేశంలోని సెకండరీ స్కూళ్లలో 70 శాతం మంది దగ్గరి చూపు సమస్యతో బాధపడుతుండడం నిజంగా కలవరపరిచేదే.
‘‘13 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు గలవారిలో 80 శాతం మందికి మయోపియా ఉంది. కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థుల్లో అయితే ఇది 90 శాతం’’ అని పెకింగ్ యూనియన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి స్పెషలిస్ట్ లాంగ్ కిన్ తెలిపారు. ‘‘విద్యార్థుల తరగతుల మాదిరిగానే మయోపియా కూడా పెరిగిపోతోంది. దీనికి కారణం హైస్కూల్, కాలేజీ ప్రవేశ పరీక్షలకు సంబంధించి తీవ్ర పోటీ కారణంగా నెలకొన్న ఒత్తిడులే’’ అని బీజింగ్ టోన్ గ్రీన్ హాస్పిటల్ డైరెక్టర్ వాంగ్ నింగ్లి పేర్కొన్నారు. మయోపియా బాధితుల సంఖ్య భారీగా ఉండడం, ఈ సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో నియంత్రణ, చికిత్సలకు సమయం పడుతుందన్నారు. సమస్యకు పరిష్కారంగా విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించి, అవుట్ డోర్ యాక్టివిటీని పెంచే చర్యలు అవసరమని సూచించారు.