manohar parikar: రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉంది?: అమెరికా నుంచి పారికర్ ఫోన్
- అమెరికాలో నాలుగు నెలలుగా చికిత్స పొందుతున్న పారికర్
- కొత్త ముఖ్యమంత్రి కావాలంటూ విపక్షాల ఆందోళన
- జర్నలిస్టులకు ఫోన్ చేసి పరిస్థితిని తెలుసుకున్న సీఎం
గోవా ముఖ్యమంత్రి మనోహన్ పారికర్ గత నాలుగు నెలలుగా అమెరికాలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అక్కడ ఆసుపత్రిలో ఉన్నప్పటికీ తన రాష్ట్రంలో ఏం జరుగుతోందో ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. తనకు సన్నిహితంగా ఉన్న జర్నలిస్టులకు ఫోన్ చేసిన ఆయన... రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి అడిగి తెలుసుకున్నారు.
పారికర్ అనారోగ్యంతో ఉన్న నేపథ్యంలో, రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి కావాలంటూ విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని... కొన్ని రోజుల్లోనే గోవాకు తిరిగివస్తానని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని ఓ సీనియర్ జర్నలిస్టు మీడియాకు తెలిపారు.
ప్రతి రోజు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నానని, ఫైళ్లను తనకు స్కాన్ చేసి పంపుతున్నారని, టెక్నాలజీ ద్వారా ప్రతి విషయాన్ని ఇక్కడి నుంచే సమీక్షిస్తున్నానని పారికర్ చెప్పినట్టు సదరు జర్నలిస్టు వెల్లడించారు. మరోవైపు, పారికల్ అమెరికాలో ఉన్న నేపథ్యంలో, ముగ్గురు మంత్రుల బృందం రాష్ట్ర పాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది.