tammareddy: ఇక గొడవలు ఆపండి .. 'మహానటి' గొప్పగా వుంది: తమ్మారెడ్డి భరద్వాజ
- సావిత్రి పాత్రను అద్భుతంగా ఆవిష్కరించారు
- జెమినీ గణేశన్ పాత్రను పాజిటివ్ గా చూపించారు
- సినిమాటిక్ సీన్స్ కి గొడవలు పడటం సరికాదు
సావిత్రి జీవితచరిత్రగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'మహానటి' తెరకెక్కింది. అన్నివర్గాల ప్రేక్షకుల మనసులను కదిలిస్తూ ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా చూసిన జెమినీ గణేశన్ మొదటి భార్య కూతుళ్లు ఇందులో తమ తండ్రి పాత్రను తప్పుగా చూపించారంటూ గొడవకి దిగారు. సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి తనదైన శైలిలో వాళ్లకి సమధానమిచ్చింది. వీరి గొడవ కారణంగా ఈ సినిమాపై అప్పటివరకూ ప్రేక్షకుల్లో వున్న అభిప్రాయం మారడం మొదలైంది.దాంతో తాజాగా ఈ విషయంపై తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. "దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను చాలా గొప్పగా తెరకెక్కించాడు. సావిత్రి పాత్రను ఆయన ఆవిష్కరించిన తీరు అద్భుతం. ఒకటి రెండు సీన్స్ మినహా జెమినీ గణేశన్ పాత్రను కూడా పాజిటివ్ గానే చూపించాడు. ఇక జెమినీ గణేశన్ మొదటి భార్య పాత్రను ఎంతో ఉన్నతంగానే చూపించాడు. ఈ విషయాన్ని జెమినీ గణేశన్ కూతుళ్లు గమనించాలి. కొన్ని సినిమాటిక్ సీన్స్ ఉంటాయి .. అవి పట్టుకుని ఆరోపణలు చేసుకోవడం సరికాదు. ఒక మంచి సినిమాను చూశామని అనుకోవాలే గానీ .. ఒకరినొకరు తిట్టుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పటివరకూ కలిసున్న మీరు ఈ కారణంగా విడిపోవడం మాకు ఇష్టం లేదు" అని చెప్పుకొచ్చారు.