Pakistan: పాకిస్థాన్ కు వార్నింగ్ ఇచ్చిన నిర్మల సీతారామన్
- కాల్పులకు పాల్పడితే దీటుగా సమాధానం ఇస్తాం
- భారత్ ను సురక్షితంగా ఉంచేందుకు ఏమైనా చేస్తాం
- అనుక్షణం అప్రమత్తంగా ఉండటమే మా లక్ష్యం
సరిహద్దుల వద్ద పదేపదే కాల్పుల విరమణకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని భారత రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ పాకిస్థాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తాము గౌరవిస్తున్నామని... ఇదే సమయంలో ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా పాకిస్థాన్ కాల్పులకు తెగబడితే భారత జవాన్లు దీటుగా సమాధానమిస్తారని హెచ్చరించారు.
చర్చలు, ఉగ్రవాదం రెండూ ఒకేసారి సాధ్యంకావని అన్నారు. భారత్ ను సురక్షితంగా ఉంచేందుకు తాము ఏమైనా చేస్తామని చెప్పారు. హెచ్చరికలు లేకుండా పాకిస్థాన్ ఉన్నట్టుండి కాల్పులు జరిపే సమయంలో కూడా అప్రమత్తంగా ఉండాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. రంజాన్ సందర్భంగా జమ్ముకశ్మీర్ లో చొరబాట్లకు వ్యతిరేకంగా నిర్వహించే కార్యకలాపాలను నిలిపివేయాలని గత నెలలో భారత ప్రభుత్వం నిర్ణయించింది. అయినప్పటికీ, పాక్ మాత్రం తన వక్ర బుద్ధిని ప్రదర్శిస్తూ, కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది.