Pawan Kalyan: రాత్రుళ్లు ఆకతాయిల వేధింపులు ఎక్కువగా ఉన్నాయి: పవన్ కల్యాణ్‌కి గిరిజన బాలికల ఫిర్యాదు
- అరకు గిరిజన గ్రామాల్లో పర్యటించిన జనసేనాని
- తమ హాస్టల్‌కి కనీసం ప్రహరీ లేదన్న కస్తూర్బా బాలికలు
- బాక్సైట్ తవ్వితే ఊళ్లు వదిలిపోవాల్సి వస్తుందన్న గిరిజనులు
- అండగా ఉంటానన్న పవన్
గిరిజన గోడు, వారి గోస వినడానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్నంలోని అరకు ఏజెన్సీలో మారుమూల గ్రామాల్లో పర్యటించారు. డుంబ్రిగూడ మండలంలో పోతంగి, హౌసింగ్ కాలనీ, తోటవలస గ్రామాలను సందర్శించారు. చిన్న చిన్న గిరిజన గూడేల్లో అడవి బిడ్డల ఇళ్ల మధ్యకు వెళ్లి, అక్కడి ప్రజల అవస్థలు స్వయంగా పరిశీలించారు.
అడవిబిడ్డల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. పంట పొలాల మధ్యకి వెళ్లిన ఆయన, అక్కడ పంటలను, నీటి వసతులకి సంబంధించిన సౌకర్యాలను పరిశీలించారు. పోతంగి గ్రామస్తులకి తాగు నీటి ఆధారమైన బావి వద్దకు వెళ్లి, స్వయంగా నీటిని తోడి పరిశీలించారు. బురద, క్రిమి కీటకాలమయంగా ఉన్న ఆ నీరే గిరిజనులకి జీవనాధారమన్న విషయాన్ని గిరిజనుల నుంచి తెలుసుకున్న పవన్ కల్యాణ్.. ఆ నీటిని పరీక్షల నిమిత్తం సేకరించి, విశాఖకు పంపారు. కాళ్లు, మెడ వాపులు లాంటి సీజనల్ వ్యాధులకు గురైన చిన్నారులని పరిశీలించారు. పోతంగి పంచాయతీ పరిధిలో ఉన్న మరో రెండు గ్రామాల్లోకి కూడా వెళ్లి, గిరిజనుల సమస్యలు, స్థితిగతులపై పరిశీలన చేశారు.
పవన్ కల్యాణ్ తమ గ్రామానికి రావడంతోటే తమ కష్టాలు తీరిపోతాయన్న నమ్మకాన్ని వెలిబుచ్చిన గిరిజనులు.. ఆయనకి తమ కష్టాలు చెప్పుకున్నారు. కలుషిత నీటి వల్ల ఏటా రోగాల బారిన పడుతున్నామని, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలతో నానా ఇబ్బందులు పడుతున్నామంటూ తమ గోడు వెళ్లబోసుకున్నారు. సీజనల్ వ్యాధులు, జ్వరాలు వ్యాపించినప్పుడు ఒకటి రెండు రోజుల పాటు అధికారులు హడావుడి చేసి వదిలేస్తారని, తరువాత తమను పట్టించుకునేవాళ్లు ఉండరని పవన్‌కి తెలిపారు.
చుట్టు పక్కల 11 మండలాల పీహెచ్‌సీల్లో డాక్టర్ల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, పరిస్థితి విషమించి విశాఖపట్నం తీసుకెళదామని 108కు ఫోన్ చేస్తే డ్రైవర్లు లేరని, డీజిల్ లేదని సమాధానం వస్తుందని చెప్పారు. అలాగే ఉపాధి హామీ పథకం బకాయిలు, ఎన్టీఆర్ గృహాలు, మరుగుదొడ్ల బకాయిల కోసం సంవత్సరాల తరబడి తిప్పుతున్నారని గిరిజనులు పవన కల్యాణ్ దృష్టికి తీసుకు వచ్చారు. ఆశా వర్కర్లకు నెలకు రూ.400 మాత్రమే జీతం ఇస్తున్నారని, అంగన్ వాడీల్లో పిల్లలకు పెట్టాల్సిన గుడ్లను సైతం అమ్మేసుకుంటున్నారని చెప్పారు. గిరిజనుల సమస్యలపై జనసేన పోరాటం చేస్తుందని పవన్ హామీ ఇచ్చారు.
కస్తూర్బా బాలికల ఫిర్యాదులు..
గిరిజన సమస్యల అధ్యయనంలో భాగంగా పవన్ కల్యాణ్ డుంబ్రిగూడలోని కస్తూర్బా బాలికల ఉన్నత పాఠశాలను, అక్కడ ఉన్న వసతి గృహాన్ని పరిశీలించారు. విద్యార్థినులతో పాటు నేల మీద కూర్చున్న ఆయన.. వసతి గృహంలో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. బాలికల వసతి గృహానికి భద్రతా ఏర్పాట్లు సరిగా లేకపోవడం వల్ల రాత్రుళ్లు ఆకతాయిల వేధింపులు ఎక్కువగా ఉన్నాయని విద్యార్థినులు అన్నారు. కనీసం ప్రహరీ గోడ కూడా లేదని ఫిర్యాదు చేశారు. అనంతరం భోజనశాలను సందర్శించిన పవన్ కల్యాణ్ ఇతర వసతులపైన ఆరా తీశారు. బెడ్ రూంలకి కనీసం కిటికీలు, తలుపులు కూడా లేవని, పాములు గదుల్లోకి వచ్చేస్తున్నాయంటూ బాలికలు తమ సమస్యలు ఏకరువు పెట్టారు. అక్కడ నుంచి వస్తోన్న జనసేన అధినేతను కురిడి గ్రామస్తులు తమ గ్రామానికి తీసుకెళ్లి సమస్యలు విన్నవించారు.
గిరిజనులకి ఎప్పుడూ అండగా ఉంటా..
కురిడి గ్రామం నుంచి నేరుగా గాలికొండ వ్యూ పాయింట్ కు చేరుకున్న పవన్ కల్యాణ్ బాక్సైట్ కొండలను పరిశీలించారు. అక్కడ సమీప గ్రామమైన బిస్ పురంకు వెళ్లారు. ఇక్కడ బాక్సైట్ తవ్వితే కొండ చుట్టూ ఉన్న సుమారు 80 గ్రామాల ప్రజలు నిరాశ్రయులవుతారని, జలాశయాల్లో నీళ్లు కలుషితమవుతాయని అక్కడి గిరిజనులు పవన్ కల్యాణ్‌కి తెలిపారు.
తమ కాఫీ తాగి పాలకులు తమనే ఇక్కడ నుంచి గెంటేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వసతుల ఊసే లేదన్నారు. అమ్ముకోవడానికే ఆంధ్ర ప్రదేశ్ కానీ, అభివృద్ధికి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు విన్న పవన్ కల్యాణ్ వారితో మాట్లాడుతూ ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.