NEET: 'నీట్'వల్ల నాశనమవుతున్న బతుకులు: అబీడ్స్ లో యువతి ఆత్మహత్యపై హీరో విశాల్
- అబీడ్స్ లో ఆత్మహత్య చేసుకున్న జస్లిన్
- ఈ పరీక్షతో ఒకరి తరువాత ఒకరిని కోల్పోతున్నాం
- ప్రభుత్వమే కోచింగ్ ఇప్పించాలి
- హీరో విశాల్ డిమాండ్
'నీట్'లో అనుకున్న ర్యాంకు రాలేదన్న మనస్తాపంతో, హైదరాబాద్, అబీడ్స్ లో భవంతిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న యువతి విషయం గురించి తెలుసుకున్న హీరో విశాల్ స్పందించాడు. జస్లీన్ కౌర్ మృతి గురించి తెలుసుకున్నానని వ్యాఖ్యానించిన ఆయన, ఈ ఘటన తన హృదయం ద్రవించేలా చేసిందని అన్నాడు.
'నీట్' పరీక్ష కారణంగా ఒకరి తరువాత ఒకరిని మనం కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. నేటి విద్యార్థులే భావి జాతి నిర్మాతలని వెల్లడించిన ఆయన, ఈ పరీక్ష విద్యార్థుల కలలను కల్లలుగా చేస్తోందని అన్నాడు. నీట్ పై విద్యార్థులు మరింత శ్రద్ధ చూపాలని సలహా ఇస్తూ, వారికి ఏదైనా సహాయం అవసరమైతే తాను ముందుంటానని చెప్పాడు. 'నీట్' పరీక్షను శాశ్వతంగా ఉంచాలని ప్రభుత్వం భావిస్తే, విద్యార్థులకు అవసరమైన కోచింగ్, సైకలాజికల్ ట్రైనింగ్ ఇప్పించాలని, లేకుంటే, ఏ పేద విద్యార్థీ, వైద్య విద్య గురించి ఆలోచించను కూడా ఆలోచించలేరని అన్నాడు.