kumaraswamy: కుమారస్వామిని ఒప్పించిన మాయావతి... తొలిసారిగా యూపీ బయట బీఎస్పీకి ఓ మంత్రి!

  • కర్ణాటకలో జేడీఎస్ తో పొత్తు పెట్టుకున్న బీఎస్పీ
  • ఎన్నికల్లో బీఎస్పీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మహేష్
  • మహేష్ ను మంత్రిని చేసిన మాయావతి

గడచిన కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ తో కలసి పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసిన బీఎస్పీ, ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించగా, ఆ ఒక్క ఎమ్మెల్యేకు కుమారస్వామి మంత్రి వర్గంలో స్థానం లభించనుంది. తమ ఏకైక ఎమ్మెల్యే ఎన్ మహేష్ కు క్యాబినెట్ బెర్త్ ను ఇచ్చేలా కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలను మాయావతి ఒప్పించారని తెలుస్తోంది. దీంతో ఉత్తరప్రదేశ్ బయట తొలిసారిగా బీఎస్పీ ఎమ్మెల్యే మంత్రి పదవిని అలంకరించనున్నారు. ఈ విషయాన్ని మాయావతి సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ సతీష్ చంద్ర మిశ్రా వెల్లడించారు. యూపీ బయట తమ ఎమ్మెల్యే మంత్రి కావడం పార్టీ వర్గాలకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

కాగా, మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో 32 మందికి మంత్రి పదవులు దక్కనున్నాయి. వీటిల్లో 20 పదవులు కాంగ్రెస్, 12 పదవులు జేడీఎస్ పంచుకోవాలన్న నిర్ణయానికి ఇరు పార్టీలూ వచ్చాయి. బీఎస్పీ ఎమ్మెల్యేకు మంత్రి పదవిని జేడీఎస్ వాటా నుంచే ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం ఏ ఆటంకాలూ లేకుండా ఐదేళ్లూ పరిపాలిస్తుందని, కాంగ్రెస్ తో ఎటువంటి ఇబ్బందులూ రావనే భావిస్తున్నామని బీఎస్పీ ఎమ్మెల్యే మహేష్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News