Bollywood: సునీల్ దత్ తనకు రాసిన ఉత్తరం గురించి చెప్పిన పరేష్ రావెల్!
- మే 25, 2005న.. నేను ఓ సినిమా షూటింగ్ లో ఉన్నా
- అదే సమయంలో సునీల్ దత్ మృతి వార్త నాకు తెలిసింది
- సునీల్ నివాసానికి వెళుతున్నానని నా భార్యకు ఫోన్ చేసి చెప్పా
- ‘సునీల్ దత్ నుంచి మీకో ఉత్తరం వచ్చింది’ అని నా భార్య చెప్పింది
బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ ‘సంజు’. రణ్ బీర్ కపూర్ ఇందులో సంజయ్ దత్ పాత్రను పోషిస్తుండగా, తండ్రి సునీల్ దత్ పాత్రలో పరేష్ రావెల్ కనిపించనున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పరేష్ రావెల్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పారు. సునీల్ దత్ తనకు రాసిన ఉత్తరం గురించి ఆయన ప్రస్తావించారు.
‘మే 25, 2005న.. నేను ఓ సినిమా షూటింగ్ లో ఉన్నాను. అదే సమయంలో సునీల్ దత్ మృతి చెందినట్టు నాకు తెలిసింది. ‘సునీల్ నివాసానికి వెళుతున్నా, రాత్రి ఇంటికి రావడం ఆలస్యమవుతుంది’ అని నా భార్యకు ఫోన్ చేసి చెప్పాను. ‘సునీల్ దత్ నుంచి మీకో ఉత్తరం వచ్చింది’ అని అప్పుడు నా భార్య నాకు చెప్పింది.
‘అందులో ఏం రాసుంది?’ అని అడిగాను. ‘మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినట్లు రాసి ఉంది’ అని నా భార్య సమాధానమచ్చింది. ‘నా పుట్టినరోజు మే 30 కదా! అని నా భార్యతో నేను అంటే.. ‘ఏమో మీ కోసమే లేఖ రాశారు’ అని చెప్పింది. నా పుట్టినరోజుకు ఐదు రోజులు ముందుగానే నాకు శుభాకాంక్షలు చెబుతూ సునీల్ జీ నాకు లేఖ రాశారు. సునీల్ జీ, నేను పండగల సమయంలో కూడా ఒకరికొకరం శుభాకాంక్షలు చెప్పుకోం. ఆయన చనిపోవడానికి ముందు ఈ లేఖ నాకు రాయడం ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇక, గతేడాది జనవరిలో ‘సంజు’ బయోపిక్ లో నా పాత్ర గురించి చర్చించేందుకు రాజ్ కుమార్ హిరాణీ వద్దకు వెళ్లాను. అంతకుముందు, నా భార్యకు ఫోన్ చేసి నాకు సంబంధించిన కొన్ని పత్రాలు బయటకు తీసి ఉంచమని చెప్పా. నేను రాజ్ కుమార్ హిరాణీ ఇంటికి వెళ్లిన కొద్ది సేపటికి నా భార్య నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఆ పత్రాలు బయటకు తీసిన సమయంలోనే సునీల్ జీ నాకు రాసిన లేఖ కూడా బయటకు వచ్చిందని చెప్పింది.
‘సంజు’ బయోపిక్ లో నా పాత్ర (సునీల్ దత్) గురించి హిరాణీ నాకు వివరిస్తున్న సమయంలోనే ఈ లేఖ గురించి నా భార్య ప్రస్తావించడంతో నేను మళ్లీ ఆశ్చర్యపోయాను. తన పాత్రలో నేనే నటించాలని సునీల్ జీ కోరుకున్నట్టున్నారని భావించి, ఈ పాత్రలో నటించేందుకు ఒప్పుకున్నాను’ అని పరేష్ రావెల్ చెప్పుకొచ్చారు.