tamil artist varalakshmi: ఆ కథనాలు అబద్ధం.. నేను బీజేపీలో చేరలేదు!: నటి వరలక్ష్మి
- ‘సంపర్క్ ఫర్ సమర్థన్’ కార్యక్రమాన్ని చేపట్టిన బీజేపీ
- ఇందులో భాగంగా వరలక్ష్మిని కలిసిన బీజేపీ నేత మురళీధర్ రావు
- వరలక్ష్మి బీజేపీలో చేరిందంటూ తమిళ మీడియా కథనాలు
తమిళ నటి వరలక్ష్మి బీజేపీలో చేరిందంటూ అక్కడి మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. ఈ కథనాలపై వరలక్ష్మి స్పందించింది. తాను బీజేపీలో చేరలేదని, ఆ వార్తలన్నీ అబద్ధమని కొట్టిపారేశారు. నరేంద్ర మోదీ నాలుగేళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘సంపర్క్ ఫర్ సమర్థన్’ కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టింది. ఇందులో భాగంగా ఆ పార్టీ నేత మురళీధర్ రావు ఈరోజు వరలక్ష్మిని కలిశారు.
ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను ఆమెకు వివరించారు. ఈ నేపథ్యంలో బీజేపీలో వరలక్ష్మి చేరిపోయిందని, పార్టీ కండువా కప్పుకుందంటూ తమిళ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న వరలక్ష్మి అసలు విషయం చెప్పింది. ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురు అయిన వరలక్ష్మి ప్రస్తుతం దళపతి 62, మిస్టర్ చంద్రమౌళి, శక్తి, కదల్ మన్నన్ సినిమాల్లో నటిస్తోంది.