Instagram: ఇన్‌స్టాగ్రామ్ లో యూట్యూబ్ తరహా ఫీచర్ త్వరలోనే!
- ఇందుకు సంబంధించి మొదలైన ప్రయత్నాలు
- ప్రస్తుతం ఒక్క నిమిషం వ్యవధిలోపున్న వీడియోలకే చాన్స్
- యూట్యూబ్ తరహా వేదికగా మలిచే ప్రయత్నాలు
ఫేస్ బుక్ అనుబంధ సంస్థ ఇన్ స్టాగ్రామ్ లో ఇక మీదట గంట నిడివి ఉన్న వీడియోలను కూడా పోస్ట్ చేసుకునే అవకాశం రానుంది. యూట్యూబ్ తరహా కంటెంట్ మాదిరిగా ఇన్ స్టా గ్రామ్ ను తీర్చిదిద్దే యోచనలో సంస్థ ఉన్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది.
ప్రస్తుతం యూజర్లు ఇన్ స్టాగ్రామ్ పేజీలో ఒక్క నిమిషంలోపున్న వీడియోలనే పోస్ట్ చేసేందుకు అవకాశం ఉంది. ఈ పరిమితిని ఎత్తేసి గంట వరకు ఉన్న వీడియోలకు ఇన్ స్టాగ్రామ్ ను వేదికగా మలిచే ప్రయత్నాలు మొదలైనట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.
ఈ ఫీచర్ పేరు లాంగ్ ఫామ్. అయితే, ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, ఇందులో మార్పులకు అవకాశం లేకపోలేదని ఆ వర్గాలు తెలిపాయి. ఈ ఫీచర్ కు సంబంధించి నిర్మాతలు, క్రియేటర్లతో సంస్థ సంప్రదింపులు జరిపి, ఎక్కువ నిడివి వీడియోలను ఇన్ స్టా గ్రామ్ కోసమే రూపొందించాలని కూడా కోరినట్టు వెల్లడించాయి.