Chandrababu: జగన్ ని రమణదీక్షితులు కలవడం మరో కుట్రకు పథకం: సీఎం చంద్రబాబు
- ఎవరో ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే నాకేంటి సంబంధం?
- తిరుమల పవిత్రతను దెబ్బతీయాలని చూస్తే ఎవరినీ క్షమించను
- చివరకు దేవుడి పేరిట కూడా రాజకీయాలు చేస్తున్నారు
వైసీపీ అధినేత జగన్ ని టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు కలవడంపై సీఎం చంద్రబాబు స్పందించారు. చిత్తూరు జిల్లా పలసపల్లెలో ఈరోజు నవనిర్మాణ దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఎవరో ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే తన కేంటి సంబంధమని ప్రశ్నించారు.
టీటీడీని తమ అధీనంలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని, చివరకు దేవుడి పేరిట కూడా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల పుణ్యక్షేత్రం పవిత్రతను దెబ్బతీయాలని చూస్తే ఎవరినీ క్షమించే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. కాగా, హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో రమణదీక్షితులు ఈరోజు సాయంత్రం జగన్ ను కలిశారు. టీటీడీ బోర్డు నిర్ణయాలను తప్పు పడుతున్న రమణ దీక్షితులు జగన్ ని కలవడం చర్చనీయాంశమైంది.