rss: ఈ గడ్డపై పుట్టిన ప్రతిఒక్కరూ భారతీయుడే!: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
- భారత్ లో అనేక భాషలు, సంస్కృతులు సమ్మిళితమై ఉన్నాయి
- రాజకీయ సిద్ధాంత వైరుద్ధ్యాలూ ఉన్నాయి
- అంతమాత్రాన మనలో విభేదాలు ఉన్నట్టు కాదు
ఈ గడ్డపై పుట్టిన ప్రతిఒక్కరూ భారతీయుడేనని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తున్న తృతీయ వర్ష్ వర్గ్ లో ఆయన మాట్లాడుతూ, భిన్నత్వంలో ఏకత్వం అనేది ఎన్నో ఏళ్లుగా భారతీయ పరంపర అని, మన దేశంలో అనేక భాషలు, సంస్కృతులు సమ్మిళితమై ఉన్నాయని అన్నారు. అయితే, రాజకీయ సిద్ధాంత వైరుద్ధ్యాలు కూడా మనలో ఉన్నాయని, అంతమాత్రాన మనలో విభేదాలు ఉన్నాయని కాదని అన్నారు. నాటి స్వాతంత్ర్యపోరాటంలో సిద్ధాంత వైరుద్ధ్యాలున్నప్పటికీ అందరి లక్ష్యం ఒక్కటేనని, రాజకీయ వైరుద్ధ్యాలున్నా దేశాభివృద్ధే మన లక్ష్యమని అన్నారు.
నాడు దేశం ఏ విధంగా విముక్తి పొందుతుందనే దానిపైనే ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెడ్గేవార్ ఆలోచనలు ఉండేవని, మనలో ఉన్న సంకుచిత భావాలను పక్కనపెట్టి ఏకత్వం సాధించాలని, సంఘటిత సమాజంతోనే బలమైన దేశం సాధ్యమని అన్నారు. సుహృద్భావం, సామరస్యం మనలో ఉన్న వైరుద్ధ్యాలను తొలగిస్తాయని, ప్రతి వ్యక్తికీ ప్రత్యేకమైన ఆలోచనా ధోరణి ఉండదని, దేశంలో ఉన్న సామాజిక పరిస్థితులను అనుసరించి వారు నడుచుకుంటూ ఉంటారని చెప్పారు.
తాత్విక బోధన, తత్త్వ చింతన కొంతమంది మాత్రమే చేయగలుగుతారని, తాత్వికతను పంచేవారిని అనుసరించే సమాజం నడుస్తుందని, సమాజంలో అగ్రభాగాన ఉన్న వారి వెనుకే అందరూ నడుస్తారని, సమాజ హితం కోరుకునే వారి వెనుకే సమాజం నడుస్తుందని అన్నారు. ఆర్ఎస్ఎస్ దేశ వ్యాప్తంగా సంఘటితమై ఉందని, అంతమాత్రాన కృతార్థులమైనట్టు కాదని, దేశం అత్యున్నత స్థాయిని అందుకున్నప్పుడే మన శ్రమకు ఫలితం లభించినట్టని అన్నారు.