KCR: సమ్మె చేస్తే చరిత్రలో ఇదే చివరిది అవుతుంది!: ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ తీవ్ర హెచ్చరిక

  • నాయకుల మాటలు విని మోసపోద్దు
  • తెలంగాణ అంటే 53 వేల మంది ఆర్టీసీ కార్మికులు మాత్రమే కాదు
  • సమ్మె పిలుపు బాధ్యతా రాహిత్యం

సమస్యల పరిష్కారం కోసం సమ్మె నోటీసు ఇచ్చిన ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నాయకుల మాటలు విని మోసపోవద్దని, తక్షణమే సమ్మె నిర్ణయాన్ని విరమించుకోవాలని సూచించారు. ఉద్యోగాలు పోగొట్టుకోవాలనుకున్న కార్మికులు మాత్రమే సమ్మెలో దిగాలని హెచ్చరించారు. కాదు, కూడదని సమ్మెకు వెళితే ఆర్టీసీ చరిత్రలోనే ఇదే చివరి సమ్మె అవుతుందని తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ అంటే నాలుగు కోట్ల మంది ప్రజలన్న సంగతిని గుర్తెరగాలని, 53వేల మంది ఆర్టీసీ కార్మికులు మాత్రమే కాదని సీఎం అన్నారు.
 
ఆర్టీసీ యూనియన్లు సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై గురువారం ప్రగతి భవన్‌లో కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ ఆర్టీసీలో సమ్మె చేయడాన్ని నిషేధించినా కొందరు తమ స్వార్థం కోసం నోటీసులు ఇచ్చారని, యూనియన్ నాయకులు ఆర్టీసీని ముంచే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.  వారి మాటలు విని కార్మికులు మోసపోవద్దని సూచించారు.

ఏడాదికి రూ.700 కోట్ల నష్టంతో నడుస్తున్న ఆర్టీసీపై ఏటా మరో రూ.1400 కోట్ల భారం పడేలా యూనియన్ నాయకులు సమ్మెకు పిలుపునివ్వడం బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని కేసీఆర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆర్టీసీ మునిగిపోతే దానికి పూర్తిగా ఆర్టీసీ కార్మిక నాయకులే కారణం అవుతారని కేసీఆర్ హెచ్చరించారు.

కార్మికులు సమ్మెకు వెళితే ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రస్తుతం ఉన్న 2200 అద్దె బస్సులకు అదనంగా ఇతర సంస్థలు, ఇతర రాష్ట్రాల సహకారం తీసుకోవాలని, పదవీ విరమణ చేసిన డ్రైవర్ల సేవలు వినియోగించుకోవాలని కేసీఆర్ అధికారులకు సూచించారు.

  • Loading...

More Telugu News