Indian Railway: విమర్శలతో వెనక్కి తగ్గిన రైల్వే.. అధిక లగేజీపై జరిమానా నిబంధన ఉపసంహరణ
- సోషల్ మీడియా ద్వారా దుమ్మెత్తి పోసిన ప్రయాణికులు
- నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న రైల్వే
- 174 స్టేషన్లలో చైల్డ్ హెల్ప్ లైన్ డెస్క్లు
ప్రయాణికుల నుంచి వస్తున్న విమర్శలతో భారతీయ రైల్వే వెనక్కి తగ్గింది. అధిక లగేజీ తీసుకెళ్లే ప్రయాణికులపై జరిమానా విధించాలన్న నిబంధనను ఉపసంహరించుకుంది. అధిక లగేజీతో రైలెక్కే ప్రయాణికులకు జరిమానా విధించాలని రైల్వే నిర్ణయించిన సంగతి విదితమే. అయితే ఇది ప్రయాణికుల ఆగ్రహానికి గురైంది. సోషల్ మీడియా వేదికగా రైల్వే నిర్ణయంపై దుమ్మెత్తిపోశారు.
మరోవైపు ప్రతిపక్షాల నుంచి కూడా తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిన రైల్వే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపింది. ప్రయాణికులకు అవగాహన కల్పించడం కోసమే ఆ నిర్ణయం తీసుకున్నాం తప్పితే, వారిని ఇబ్బంది పెట్టాలని కాదని పేర్కొంది. కాగా, రైల్వే స్టేషన్లలో తప్పిపోయిన, విడిచిపెట్టిన, పారిపోయి వచ్చిన, అక్రమ రవాణాకు గురవుతున్న చిన్నారులను గుర్తించేందుకు 174 రైల్వే స్టేషన్లలో చైల్డ్ హెల్ప్ లైన్ డెస్క్లను ఏర్పాటు చేస్తున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.